నితిన్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఇప్పట్లో కష్టమేనా?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒకప్పుడు వరుస విజయాలతో మంచి మార్కెట్ సంపాదించినా.. గత కొన్నేళ్లుగా మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
By: M Prashanth | 10 May 2026 11:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒకప్పుడు వరుస విజయాలతో మంచి మార్కెట్ సంపాదించినా.. గత కొన్నేళ్లుగా మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. భీష్మ తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయిన నితిన్.. వరుసగా సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా గతేడాది విడుదలైన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నా.. రెండూ నిరాశపరిచాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ కొత్త ప్రాజెక్టుల ఎంపికలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నారి సిరిసవాడ, టి సోమశేఖర్ ఆ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయ్ సినిమా ఫేమ్ అంజి కె. మణిపుత్ర చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకెళ్లాలని నితిన్ భావిస్తున్నారట.
అయితే నాగవంశీ తన సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దర్శకుడు వీఐ ఆనంద్ తో నితిన్ చేయాల్సిన సైన్స్ ఫిక్షన్ మూవీపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఆ ప్రాజెక్ట్ పై మంచి హైప్ ఏర్పడింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం, ఊరు పేరు భైరవకోన లాంటి విభిన్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్.. నితిన్ కోసం కూడా ఓ కొత్త కాన్సెప్ట్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరిగింది.
ఆ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనుందని, అన్నదమ్ముల నేపథ్యంతో కథ సాగుతుందని సమాచారం. అంతేకాదు ఇందులో నితిన్ డ్యూయల్ రోల్ చేయనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నితిన్ మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గతంలో ఆయన చేసిన అల్లరి బుల్లోడులో డబుల్ రోల్ కనిపించినా.. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు ఆ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ముందుకు సాగడంలో ప్రధాన అడ్డంకి బడ్జెట్ గా మారినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో భారీ వ్యయంతో తెరకెక్కించాల్సిన పరిస్థితి ఉందట. కానీ వరుస ఫ్లాపుల కారణంగా ప్రస్తుతం నితిన్ మార్కెట్ కొంత తగ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
అంతేకాదు కథలో కొన్ని మార్పులు చేయాలని నిర్మాత సూచించారని, ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో సందేహాలు వ్యక్తమయ్యాయని టాక్. ఖర్చు తగ్గించేలా మార్పులు చేయాలని కోరినా.. దర్శకుడు వీఐ ఆనంద్ తన అసలు విజన్ ను మార్చేందుకు అంతగా ఆసక్తి చూపలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం తాత్కాలికంగా పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో నితిన్ వివిధ సినిమాలతో బిజీ కావడంతో.. వీఐ ఆనంద్ అదే కథను మరో హీరోకు వినిపించే ప్రయత్నంలో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో నితిన్ మాత్రం ముందుగా సితార బ్యానర్ సినిమా ద్వారా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా విజయం సాధిస్తే ఆయన మార్కెట్ మళ్లీ బలపడే అవకాశం ఉంది. అప్పుడు వీఐ ఆనంద్ తో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ తిరిగి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అదే నిజమైతే ఇప్పట్లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లడం కష్టమేనేమో! మరేం జరుగుతుందో వేచి చూడాలి.
