ఆ ఇద్దరితో మైత్రీ రిస్క్?
ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు, హీరో నితిన్, డైరెక్టర్ శ్రీను వైట్ల, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. వినిపిస్తున్న వార్తలు నిజమైతే మాత్రం ఈ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా అవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 9 Sept 2025 4:58 PM ISTఇండస్ట్రీలో కాంబినేషన్లకు మంచి హైప్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ కాంబినేషన్ హీరో- డైరెక్టర్ ల రూపంలో ఉంటే ఇంకొన్ని సార్లు అది హీరో-హీరోయిన్ కాంబినేషన్, మరోసారి మరో కాంబినేషన్.. ఇలా రకరకాల కాంబినేషన్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని కాంబినేషన్ ఒకటి టాలీవుడ్ లో సెట్ అయినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఎవరూ ఊహించని కాంబినేషన్
ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు, హీరో నితిన్, డైరెక్టర్ శ్రీను వైట్ల, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. వినిపిస్తున్న వార్తలు నిజమైతే మాత్రం ఈ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా అవుతుంది. ఈ ముగ్గురూ కలిసి గతంలో వర్క్ చేయకపోయినా మైత్రీ బ్యానర్ లో సదరు హీరో, డైరెక్టర్ ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేశారు. శ్రీను వైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేస్తే, నితిన్ రాబిన్‌హుడ్ చేశారు.
నితిన్‌కు భీష్మనే ఆఖరి హిట్
ఆ రెండు సినిమాలూ మైత్రీ మూవీ మేకర్స్ కు భారీ నష్టాల్నే మిగిల్చాయి. అలాంటి వారిద్దరినీ కలిపి ఇప్పుడు మైత్రీ నిర్మాతలు సినిమా చేసే సాహసం చేస్తున్నారు. అటు నితిన్‌కు, ఇటు శ్రీను వైట్లకు హిట్లు పడి చాలా కాలమవుతుంది. నితిన్ కు 2016 నుంచి ఇప్పటివరకు భీష్మ తప్ప మరో హిట్ లేదు. మధ్యలో ఎన్నో సినిమాలొచ్చాయి కానీ అవన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగానే నిలిచాయి.
గోపీచంద్ తో విశ్వం చేసి ఫ్లాపు
మరోవైపు శ్రీనువైట్ల పరిస్థితి కూడా అంతే ఉంది. గత కొన్ని సినిమాలుగా ఫామ్ లో లేని వైట్ల మొన్నామధ్య గోపీచంద్ తో విశ్వం చేసి మరో ఫ్లాపు ను మూట గట్టుకున్నారు. మరి వీరిద్దరితో సినిమా చేయడానికి మైత్రీ ప్లాన్ ఏంటనేది అర్థం కావడం లేదు. ఇద్దరు ఫామ్ లో లేని వారితో సినిమా చేసి హిట్ కొడదామని ప్లాన్ చేస్తున్నారా? లేక గతంలో వారి బ్యానర్ లో జరిగిన నష్టాన్ని ఈ కాంబినేషన్ తో బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
రిస్క్ లో నితిన్ మార్కెట్
తమ్ముడు సినిమా తర్వాత నితిన్ కెరీర్ బాగా రిస్క్ లో పడినట్టైంది. వాస్తవానికైతే తమ్ముడు రిలీజవగానే బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ తమ్ముడు ఫలితం చూశాక దిల్ రాజు ఆలోచనలో పడ్డారు. ఇష్క్ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ తో నితిన్ ఓ ప్రాజెక్టును సెట్ చేసుకున్నప్పటికీ అది పట్టాలెక్కడానికి టైమ్ పట్టేట్టుంది. కాబట్టి నితిన్ నెక్ట్స్ మూవీ శ్రీను వైట్లతోనే అని ఫిక్స్ అయిపోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది.
