Begin typing your search above and press return to search.

ఆ ఒక్క హిట్ కోసం.. నితిన్ మళ్ళీ 'ఇష్క్' మోడ్‌లోకి?

ఈ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో నితిన్ ఇప్పుడు తన కెరీర్‌ను పునసమీక్షించుకునే పనిలో పడ్డాడు. ప్రతీ అడుగును ఆచితూచి వేస్తూ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నాడు.

By:  M Prashanth   |   17 Oct 2025 11:59 AM IST
ఆ ఒక్క హిట్ కోసం.. నితిన్ మళ్ళీ ఇష్క్ మోడ్‌లోకి?
X

ఒక సక్సెస్ ఎంత కిక్ ఇస్తుందో, ఒక ఫెయిల్యూర్ అంతకంటే పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. యంగ్ హీరో నితిన్‌కు ఇప్పుడు సరిగ్గా అదే ఎదురవుతోంది. 'రాబిన్‌హుడ్', 'తమ్ముడు' చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. ఈ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో నితిన్ ఇప్పుడు తన కెరీర్‌ను పునసమీక్షించుకునే పనిలో పడ్డాడు. ప్రతీ అడుగును ఆచితూచి వేస్తూ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నాడు.

ఈ పునరాలోచనలో భాగంగా, నితిన్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎంతో క్రేజ్ ఉన్న 'బలగం' ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో చేయాల్సిన 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ నుంచి, అలాగే విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్పోర్ట్స్ డ్రామా నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ మార్కెట్ అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి ఇది కేవలం సినిమాలను వదులుకోవడం కాదు, తన ప్రస్తుత ఇమేజ్‌కు, మార్కెట్‌కు ఏ కథ సరిపోతుందో లోతుగా విశ్లేషించుకుంటున్నాడనడానికి నిదర్శనం.

ప్రస్తుతం నితిన్ కొత్త దర్శకులు, సరికొత్త కథల వైపు చూస్తున్నాడు. 'లిటిల్ హార్ట్స్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి మార్తాండ్‌తో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ కోసం చర్చలు జరుపుతున్నాడని టాక్ వచ్చింది. ఇది నితిన్‌కు బాగా కలిసొచ్చిన జానర్. తన కెరీర్‌ను ఎన్నోసార్లు నిలబెట్టింది ప్రేమకథలే. అందుకే, మళ్ళీ ఆ సేఫ్ గేమ్‌తో ట్రాక్‌లోకి రావాలని ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తోంది.

అయితే, లేటెస్ట్‌గా మరో టాక్ కూడా వినిపిస్తోంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' లాంటి థ్రిల్లర్లతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు VI ఆనంద్‌తో నితిన్ కథా చర్చల్లో ఉన్నాడనేది హాట్ టాపిక్. ఇది నితిన్ కేవలం సేఫ్ గేమ్ ఆడాలనుకోవడం లేదని, ఆడియన్స్‌ను థ్రిల్ చేసే ఒక కొత్త కాన్సెప్ట్‌తో రావడానికి సిద్ధంగా ఉన్నాడని సూచిస్తోంది. మరోవైపు, శ్రీను వైట్ల పేరు కూడా వినిపిస్తున్నా, అది కేవలం రూమర్‌గానే ఉంది.

ఈ మొత్తం పరిణామాన్ని చూస్తుంటే, పదేళ్ల క్రితం నాటి 'ఇష్క్' సమయం గుర్తుకొస్తోంది. అప్పుడు కూడా వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు, ఒక ఫ్రెష్, అర్బన్ లవ్ స్టోరీతో నితిన్ కెరీర్ గ్రాఫ్‌నే మార్చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మాస్ మసాలా కథలను పక్కనపెట్టి, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లేదా యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్‌నూ నితిన్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఎంచుకోబోయే తదుపరి చిత్రం అతని కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది. మరి నితిన్ 'లిటిల్ హార్ట్స్' లాంటి సేఫ్ లవ్ స్టోరీతో వస్తాడా లేక VI ఆనంద్ లాంటి దర్శకుడితో రిస్క్ తీసుకుని కొత్తగా మెప్పిస్తాడా.. అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.