Begin typing your search above and press return to search.

2026 ముగింపు వేళ బాక్స్ ఆఫీస్ క్లాష్!

చిత్ర పరిశ్రమలో ఏడాది ముగింపు వేళ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Srikanth Kontham   |   11 Oct 2026 5:00 AM IST
2026 ముగింపు వేళ బాక్స్ ఆఫీస్ క్లాష్!
X

చిత్ర పరిశ్రమలో ఏడాది ముగింపు వేళ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలవుల కాలం కావడంతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఎక్కువగా మొగ్గు చూపే సమయమిది. అయితే 2026 చివరి రెండు నెలల ప్రణాళికలు చూస్తుంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మునుపెన్నడూ లేనంత భారీ పోటీ క‌నిపిస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా యంగ్ హీరోల చిత్రాలు బరిలోకి దిగ‌డంతో థియేటర్ల వద్ద భారీ క్లాష్ వాతావరణం కనిపిస్తోంది.

నవంబర్ నెల ఆరంభంలోనే యంగ్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 12న శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా `భోగి` థియేటర్లలో సందడి చేయనుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంపై శర్వానంద్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆ వెంటనే నవంబర్ 19న యూత్ ప్రాంచైజీగా క్రేజ్ సంపాదించుకున్న `ఈ నగరానికి ఏమైంది 2`తో విశ్వక్సేన్ థియేటర్లలో రచ్చ చేయడానికి వస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్‌తో ఈ సీక్వెల్‌పై భారీ బజ్ నెలకొంది.

నవంబర్ మూడో వారంలో మరింత ఆసక్తికరమైన పోటీ నెల‌కొంటుంది. `ఈ నగరానికి ఏమైంది 2` విడుదలైన మరుసటి రోజే అంటే నవంబర్ 20న వర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ న‌టిస్తోన్న `ఆకాశంలో ఒకతార` ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పే దుల్కర్ ఈ చిత్రంతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రాభవాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ రోజుల్లో ఇద్దరు క్రేజీ హీరోల చిత్రాలు రావడం ట్రేడ్ వర్గాల్లో సైతం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

డిసెంబర్ నెల విషయానికి వస్తే మొదటి వారంలోనే టాలీవుడ్‌లో సరికొత్త బాక్స్ ఆఫీస్ యుద్ధం మొదలుకానుంది. డిసెంబర్ 4న ఏకంగా ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు ఒకేసారి థియేటర్లను పలకరించేందుకు క్యూ కట్టాయి. అందులో నాని నిర్మిస్తున్న ప్రొడక్షన్ నుంచి నితిన్ హీరోగా న‌టిస్తోన్న `అలియాస్ రుక్మిణి` చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చాలా కాలం తర్వాత నితిన్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌తో రాబోతుండటంతో ఈ సినిమాపై బిజినెస్ బజ్ గట్టిగానే ఉంది.

సరిగ్గా అదే రోజున (డిసెంబర్ 4న) నాగచైతన్య న‌టిస్తోన్న మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ `వృషకర్మ` కూడా బిగ్ రిలీజ్‌కు సిద్ధమైంది. `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరితో పాటు మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ `లెగసీ` కూడా డిసెంబర్ 4నే రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవడంతో ఆ రోజున ముగ్గురు హీరోల మధ్య ముక్కోణపు పోటీ తప్పేలా లేదు.

మొత్తంగా 2026 చివ‌రి రెండు నెలలు టాలీవుడ్ ప్రేక్షకులకు, సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే వినోదాన్ని పంచబోతున్నాయి. ఒకే రోజున లేదా రోజుల వ్యవధిలోనే భారీ ప్రాజెక్టులు బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో తీవ్ర పోటీ నెలకొననుంది. మరి ఇయర్ ఎండ్ బాక్స్ ఆఫీస్ బ్యాటిల్‌లో ఏ హీరో గెలిచి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి ఫామ్‌లోకి వస్తారో చూడాలి.