రూట్ మార్చిన నితిన్.. ఈసారి తన స్ట్రెంగ్త్ మీదే నమ్మకం!
వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ మళ్లీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో దర్శకుడు రామ్ అబ్బరాజుతో సినిమా చేయనున్నట్లు సమాచారం. శ్రీ విష్ణుతో ‘ఫ్యామిలీ ప్యాక్’ పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
By: M Prashanth | 22 Nov 2026 5:06 PM ISTవరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్, ఇప్పుడు తన సినిమాల సెలక్షన్ లో పూర్తిగా రూట్ మారుస్తున్నారు. ఒకప్పుడు మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని, మార్కెట్ పెంచుకోవాలని భారీ యాక్షన్ కథల వైపు వెళ్లిన అతనికి ఆ ప్రయోగాలు అస్సలు కలిసిరాలేదు. 'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' నిరాశపరచగా, గతేడాది వచ్చిన 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' కూడా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయాయి.
బడ్జెట్ పెరిగి, ఓపెనింగ్స్ తగ్గడంతో నిర్మాతల మీద ఒత్తిడి పెరిగింది. దీంతో ఇప్పుడు యాక్షన్ హంగులు పక్కన పెట్టి, తనకు బాగా అచ్చొచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ కామెడీ ట్రాక్ లోకి రావాలని నితిన్ ఫిక్స్ అయ్యారు. ఈ ఆలోచనతోనే ఆయన ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్లకు కేరాఫ్ గా మారిన రామ్ అబ్బరాజుతో చేతులు కలపబోతున్నారు. 'వివాహ భోజనంబు' తో దర్శకుడిగా అడుగుపెట్టిన రామ్, 'సామజవరగమన' తో తన మార్క్ కామెడీ టైమింగ్ ఏంటో చూపించారు.
ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్ తో తీసిన 'నారీ నారీ నడుమ మురారి' తో మరో క్లీన్ హిట్ కొట్టారు. పెద్ద ఫైట్లు, బిల్డప్ షాట్స్ కాకుండా సిట్యుయేషనల్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం రామ్ స్టైల్. నితిన్ బాడీ లాంగ్వేజ్ కు ఇలాంటి కథలు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని చెప్పవచ్చు. కెరీర్ లో నితిన్ అందుకున్న బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ సరదాగా సాగే రొమాంటిక్ కామెడీ సినిమాలే.
'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'అ ఆ', 'భీష్మ' చిత్రాల్లో ఆయన చూపించిన ఈజ్, కామెడీ టైమింగ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. మాస్ రోల్స్ లో కంటే ఇలాంటి లైట్ హార్టెడ్ క్యారెక్టర్లలోనే నితిన్ నేచురల్ గా కనిపిస్తారనేది ఫ్యాన్స్ అభిప్రాయం కూడా. అందుకే రామ్ అబ్బరాజు లాంటి డైరెక్టర్ తో సినిమా అనగానే నితిన్ మళ్లీ తన పాత ఫామ్ లోకి వస్తారనే నమ్మకం కనిపిస్తోంది.
అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ కంటే ముందే నితిన్ 'అలియాస్ రుక్మిణి' సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. 'అలియాస్ రుక్మిణి' రిజల్ట్ ఎలా ఉన్నా, ముందుగానే తన తదుపరి సినిమాల లైనప్ ను పక్కాగా సెట్ చేసుకునే పనిలో నితిన్ ఉన్నారు.
మరోవైపు రామ్ అబ్బరాజు ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా 'ఫ్యామిలీ ప్యాక్' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఆ సినిమా రిలీజ్ పనులు ముగిసిన వెంటనే నితిన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుస పరాజయాలతో మార్కెట్ కాస్త డల్ అయిన టైమ్ లో నితిన్ తన స్ట్రెంగ్త్ ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ అబ్బరాజుతో నితిన్ వేస్తున్న ఈ అడుగు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.
