ఆఖరికి నితిన్ ఆయన కథకు ఓకే చెప్తున్నాడా?
అప్పుడెప్పుడో 2016లో వచ్చిన అ..ఆ తర్వాత నితిన్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 11:00 PM ISTటాలీవుడ్ హీరో నితిన్ కు ప్రస్తుతం చాలా గడ్డు కాలం నడుస్తోంది. చేస్తున్న సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులవడంతో పాటూ ఒప్పుకున్న సినిమాలు కూడా ఆగిపోవడం, ఆ ప్రాజెక్టులు వేరే వారి చేతిలోకి వెళ్లడం జరుగుతూ వస్తుంది. ఇండస్ట్రీలో ఛాన్సులు రావడమే కష్టమనుకుంటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంకా కష్టమని నితిన్ ను చూస్తే అర్థమవుతుంది.
సక్సెస్‌కు ఆమడదూరంలో నితిన్
అప్పుడెప్పుడో 2016లో వచ్చిన అ..ఆ తర్వాత నితిన్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో భీష్మ తప్పించి మిగిలినవన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగా నిలిచినవే. ఎప్పటికప్పుడు ఈ సినిమా అయినా నితిన్ ను నిలబెడుతుందేమో అనుకోవడమే తప్పించి ఏ సినిమా నితిన్ కు సక్సెస్ ను దరిచేర్చలేదు. ఈ ఏడాది ఆల్రెడీ నితిన్ నుంచి రాబిన్‌హుడ్, తమ్ముడు సినిమాలు రాగా ఆ రెండు సినిమాలు కూడా సక్సెస్ కాలేదు.
ఓకే అనుకున్న ప్రాజెక్టులకు కూడా బ్రేక్..
దీంతో నితిన్ మార్కెట్ బాగా డల్ అయింది. అయినా సరే అవకాశాలు నితిన్ వద్దకు వెళ్లాయి. తమ్ముడు మూవీ తర్వాత నితిన్, బలగం ఫేమ్ వేణు తో ఎల్లమ్మ సినిమా చేస్తాడన్నారు. రేపో మాపో సెట్స్ పైకి వెళ్లడమే లేటనుకునే టైమ్ లో ఆ ప్రాజెక్టు చేజారింది. తర్వాత తనకు ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన విక్రమ్ కె కుమార్ తో సినిమా అన్నారు. కానీ అది పట్టాలెక్కడం లేదు.
విఐ ఆనంద్ తో నితిన్ మూవీ
మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు నితిన్ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ మూవీ చేస్తున్నారని తెలుస్తోంది. డిఫరెంట్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తన రైటింగ్, డైరెక్షన్ తో డిఫరెంట్ మేకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విఐ ఆనంద్.
ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన సినిమాలు దేనికదే డిఫరెంట్ జానర్లలో తీసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్ తో నితిన్ తన తర్వాతి సినిమాను చేయబోతున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు. అయితే ఎన్నో సినిమాలను వదులుకున్న నితిన్ ఇప్పుడు ఫైనల్ గా విఐ ఆనంద్ దగ్గర ఆగడం ఫ్యాన్స్ కు కూడా కాస్త ఆశలను రేకెత్తిస్తుంది. మరి ఆనంద్ అయినా నితిన్ కు హిట్టిస్తారేమో చూడాలి.
