నితిన్‌తో దిల్ రాజు బిగ్ గేమ్ ఆడుతున్నాడా?
టైర్ 2 హీరోల్లో నితిన్ మళ్లీ హిట్టు కోసం మళ్లీ గజినీ మొహమ్మద్‌లా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు.
By: bunnyanil761@gmail.com | 13 Jun 2025 10:33 AM ISTటైర్ 2 హీరోల్లో నితిన్ మళ్లీ హిట్టు కోసం మళ్లీ గజినీ మొహమ్మద్‌లా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. అయినా ఫలితం లభించడం లేదు. వరుస ఫ్లాపుల తరువాత`ఇష్క్` సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టిన నితిన్ ఆ తరువాత అదే ఊపుని కొనసాగిస్తూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ గత కొంత కాలంగా మళ్లీ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. రీసెంట్‌గా వెంకీ కుడుములతో నితిన్ చేసిన మూవీ 'రాబిన్ హుడ్'.
దీనిపై భారీ ఆశలు పెట్టుకుంటే ఇది కూడా భారీ ఫ్లాప్‌గా నిలిచి నితిన్‌కు షాక్ ఇచ్చింది. రూ.60 కోట్లతో తీస్తే అందులో సగాన్ని కూడా రాబట్టలేకపోయిందంటే 'రాబిన్ హుడ్' ఏ స్థాయి డిజాస్టర్‌గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నితిన్ చేసిన సినిమా 'తమ్ముడు'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దాదాపు రూ.70 కోట్లతో దీన్ని నిర్మించారు. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ఇది.
వేణు శ్రీరామ్ దర్శకుడు. 'వకీల్ సాబ్' తరువాత తను డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కొత్త తరహా కథతో, సరికొత్త స్క్రీన్ ప్లేతో దీన్ని రూపొందించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చాలా రోజుల తరువాత రీఎంట్రీ ఇస్తున్న లయ ఇందులో నితిన్‌కు అక్కగా నటిస్తుండటం మెయిన్ ప్లస్ పాయింట్. అయితే నితిన్ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా రూ.70 కోట్లని రికవర్ చేయగలదా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్?. దిల్ రాజు ఎంత ధీమాగా ఉన్నా ఒక విధంగా చెప్పాలంటే నితిన్‌తో బిగ్ గేమ్ ఆడుతున్నట్టేనని అంతా అంటున్నారు.
బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో ఈ సినిమాకు నితిన్ పారితోషికం తీసుకోలేదట. హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటాడట. దర్శకుడిదీ ఇదే పరిస్థితి. చిన్న సినిమాలు సైతం రూ.100 కోట్లు రాబడుతున్న నేపథ్యంలో నితిన్ `తమ్ముడు` హిట్ అంటే రూ.70 కోట్లకు మించి వస్తాయా? అన్నది అందరి డౌట్. ఏది ఏమైనా నితిన్ భవితవ్యం `తమ్ముడు` చేతిలో ఉందని, ఇది హిట్ అయితేనే మనోడి కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
