Begin typing your search above and press return to search.

రామాయ‌ణం ప్ర‌మోష‌న్స్ : SS రాజమౌళి బాటలో నితీష్ తివారీ వ్యూహం

భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ఘనత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి దక్కుతుంది.

By:  Sivaji Kontham   |   16 July 2026 12:55 PM IST
రామాయ‌ణం ప్ర‌మోష‌న్స్ : SS రాజమౌళి బాటలో నితీష్ తివారీ వ్యూహం
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ఘనత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి దక్కుతుంది. అత‌డు సృష్టించిన బాహుబలి, RRR చిత్రాలను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, శాన్ డియాగో కామిక్-కాన్ - మెక్సికో సీసీఎక్స్‌పి వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రమోట్ చేసి గ్లోబల్ మార్కెట్‌ను కొల్లగొట్టారు. ఇప్పుడు అదే బాటలో దర్శకుడు నితీష్ తివారీ తన విజువల్ వండర్ 'రామాయణ' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి సరికొత్త అంతర్జాతీయ వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాప్ కల్చర్ -కామిక్ బుక్ కన్వెన్షన్ అయిన 'శాన్ డియాగో కామిక్-కాన్ 2026' వేదికపై ఈ భారతీయ ఇతిహాసానికి సంబంధించిన గ్లోబల్ ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు.

ఈ మహా ఈవెంట్‌లో 'రామాయణ' చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల 15 సెకన్ల నిడివి గల భారీ ట్రైలర్‌ను లాంచ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ట్రైలర్‌కు ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) జూలై 15న ఎటువంటి కట్స్ లేకుండా 'యు' సర్టిఫికేట్ మంజూరు చేసింది. అమెరికా కాలమానం ప్రకారం జూలై 23న మధ్యాహ్నం 3:15 నుండి 4:15 గంటల మధ్య -భారతీయ కాలమానం ప్రకారం జూలై 24, శుక్రవారం తెల్లవారుజామున 3:45 నుండి 4:45 గంటల మధ్య ఈ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రపంచ సినీ ప్రేమికుల సమక్షంలో అత్యంత వైభవంగా జరగనుంది.

శాన్ డియాగో కామిక్-కాన్‌లోని రెండవ అతిపెద్ద వేదిక అయిన 'బాల్‌రూమ్ 20' లో ఈ ప్యానెల్ నిర్వహించబోతున్నారు. ఎలాంటి స్తంభాలు లేకుండా దాదాపు 4800 మంది కూర్చునే సామర్థ్యం గల ఈ భారీ హాల్‌లో ఇప్పటివరకు ఎవరూ చూడని ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, లైవ్ పర్ఫార్మెన్స్‌లు, ప్రత్యేక బహుమతుల తో వేదికను హోరెత్తించనున్నారు. ఈ చారిత్రాత్మక వేదికపై అంతర్జాతీయ సూపర్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న `రాముడు` రణ్‌బీర్ కపూర్, `రావణుడు` రాకింగ్ స్టార్ యష్ లతో పాటు నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీ నేరుగా పాల్గొని ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు.

ఒకవైపు 'రామాయణ' టీమ్ గ్లోబల్ మార్కెట్‌పై కన్నేయగా.. ఇదే కామిక్-కాన్ వేదిక హాలీవుడ్ దిగ్గజాలతో కూడా సందడిగా మారనుంది. జూలై 25న మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫైగ్ దాదాపు 6500 మంది సామర్థ్యం ఉన్న 'హాల్ హెచ్' వేదికపై మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు) భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను ప్రకటించనున్నారు. ఇందులో మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఎవెంజర్స్: డుమ్స్‌డే' ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

హాలీవుడ్ దిగ్గ‌జాల నుంచి ఇంకా చాలా సినిమాల ప్ర‌చారంతో కామిక్ కాన్ హోరెత్త‌నుంది. 'గాడ్జిల్లా' ఫేమ్ దర్శకుడు ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ 'ఆన్‌స్లాట్' ప్యానెల్‌తో వారు ఈ ప్రైమ్ స్లాట్‌లో అరుదైన ప్రదర్శన ఇవ్వబోతున్నారు. నటీనటులు అడ్రియా అర్జోనా.. రెబెక్కా హాల్‌లతో కూడిన ఈ టీమ్.. శరధృతువు వరకు మరెక్కడా ప్రదర్శించని ఒక ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ను ఈ వేదికపై చూపించబోతున్నారు. ఇలాంటి ప్రపంచ స్థాయి దిగ్గజాల మధ్య మన `రామాయణ` చిత్రం ఇండియన్ సినిమా సత్తాను చాటిచెప్పడానికి సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.