45 భాషల్లో రామాయణ.. నెవ్వర్ బిఫోర్ ఏమో!
పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో భారీ రేంజ్ లో రామాయణ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 10 Dec 2025 1:00 PM ISTపవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో భారీ రేంజ్ లో రామాయణ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదలవ్వనున్నాయి.
సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ , సీతగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణుడిగా స్టార్ హీరో యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్, లక్ష్మణుడిగా రవి దూబే యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో రామాయణ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉండగా.. రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి వాటిని ఆకాశాన్ని తాకేలా పెంచారు.
విజువల్ వండర్ గా సినిమా ఉండనుందని చెప్పకనే చెప్పిన గ్లింప్స్.. సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. అంతలా అందరినీ ఆకట్టుకుంది. అయితే రామాయణ మేకర్స్ గ్లింప్స్ అరబిక్ వెర్షన్ ను ఇటీవల రిలీజ్ చేశారు. దీంతో సినిమాను అరబిక్ భాషలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని అందరినీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అయితే గ్లింప్స్ అరబిక్ వెర్షన్ ను విడుదల చేయడం ద్వారా సినిమా గ్లోబల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ను మేకర్స్ ప్రారంభించినట్లు అయింది. ఎందుకంటే ఓవరాల్ గా రామాయణ ప్రపంచవ్యాప్తంగా 45-50 భాషల్లో విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరిగినట్లు లేదు. అన్ని భాషలంటే నెవ్వర్ బిఫోర్ ఏమో.
నిజానికి.. అరబ్ దేశాల్లో రామాయణం ఆధారంగా నిర్మించిన మూవీ ఇప్పటివరకు ఏం లేదు. కానీ రామాయణ, మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించే ప్రయత్నాలు జరిగాయి. ప్రముఖ లెబనీస్ కవి వాడి-అల్-బుస్తానీ 2013లో రామాయణాన్ని అరబిక్ లోకి అనువదించారు. కువైట్‌కు చెందిన అబ్దుల్లా అల్ బరూన్ కూడా ఇతిహాసాలను అరబిక్ లో అనువదించారు.
ఇప్పుడు రామాయణ మూవీ అరబిక్ లో కూడా రానుంది. సినిమాలోని కొన్ని పాత్రల పేర్లు స్థానిక సంస్కృతికి అనుగుణంగా మార్చుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రామాయణ మేకర్స్.. భారీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. తమదైన శైలిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి బాలీవుడ్ రామాయణకు అరబ్ దేశాల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.
