Begin typing your search above and press return to search.

తెలుగు వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప‌రిత‌పించిన‌ నితీష్!

తెలుగు సినిమాలపై తనకు ఉన్న‌ మమకారాన్ని వివరిస్తూ.. తాను `గీతాంజలి`, `క్షణక్షణం` వంటి క్లాసిక్ సినిమాలను అప్పట్లోనే తెలుగులోనే చూశానని నితీష్ తివారీ తెలిపారు.

By:  Sivaji Kontham   |   20 Oct 2026 10:25 AM IST
తెలుగు వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప‌రిత‌పించిన‌ నితీష్!
X

మోస్ట్ అవైటెడ్ `రామాయ‌ణం` సినిమా ఈ దీపావ‌ళి కానుక‌గా థియేట‌ర్ల‌లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం హైద‌రాబాద్ లో భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తోంది. `రామాయణం` ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు నితీష్ తివారీ చేసిన వ్యాఖ్యలు, తెలుగు చలనచిత్ర పరిశ్రమతో ఆయనకున్న అనుబంధం అందరినీ ఆకట్టుకున్నాయి. నితీష్ తివారీకి రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), మణిరత్నం సినిమాలంటే ఎంతో ఇష్టమని.. ముఖ్యంగా ఆర్జీవీ తెరకెక్కించిన `శివ`, `క్షణక్షణం` వంటి సినిమాలు చూసిన త‌న‌కు ఆల్మోస్ట్ సినిమా పిచ్చి పట్టింద‌ని అత‌డు స్వయంగా అంగీకరించారు. తన కాలేజీ రోజుల్లో రూమ్‌మేట్ ఒక హైదరాబాదీ కావడంతో తెలుగు సినిమాలతో తనకు అనుబంధం ఏర్పడిందని నితీష్ తెలిపారు.

ఈ వేదికపై దర్శకుడు నితీష్ తివారీ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో చూసిన `శివ` సినిమా తనపై ఎంతగానో ప్రభావం చూపిందని చెప్పారు. అప్పట్లో ఆ నటులు ఎవరో తనకు తెలియకపోయినా నాగార్జున, అమలల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఆశ్చర్యపోయానని.. ఆ సినిమాతోనే అసలు రామ్ గోపాల్ వర్మ ఎవరనేది తెలుసుకున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా చిరంజీవి నటించిన `ప్రతిబంధ్` సినిమా కూడా తనను ఎంతగానో ఆకట్టుకుందని గుర్తుచేసుకున్నారు.

తెలుగు సినిమాలపై తనకు ఉన్న‌ మమకారాన్ని వివరిస్తూ.. తాను `గీతాంజలి`, `క్షణక్షణం` వంటి క్లాసిక్ సినిమాలను అప్పట్లోనే తెలుగులోనే చూశానని నితీష్ తివారీ తెలిపారు. అంతేకాకుండా వేదికపై అందరి సమక్షంలో `నందికొండ వాగుల్లోన...` అంటూ `గీతాంజలి` సినిమాలోని మధురమైన పాటను పాడి వినిపించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఆ ప్రేమకథా చిత్రాన్ని.. అందులోని జ్ఞాపకాలను ఆయన వేదికపై గుర్తుచేసుకున్న తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి దిగ్గజ దర్శకుల ప్రతిభను కొనియాడుతూ.. తెలుగు సినిమా స్థాయిని ఆయన ప్రశంసించారు. ఈ వేదిక‌పై క‌నీసం డ‌జ‌ను మంది తెలుగు సినీ ప్ర‌ముఖుల గురించి ప్ర‌స్థావిస్తూ నితీష్ ఇక్క‌డి వారి దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసారు. అతడి ప్ర‌య‌త్నంలోని నిజాయితీ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. హిందీ ప్రేక్షకులు ఏవిధంగా సౌత్ సినిమాలను అక్కున చేర్చుకుంటున్నారో అదే రీతిలో తమ ప్రతిష్టాత్మక `రామాయణం` చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. భాషలతో సంబంధం లేకుండా ప్రతి గొప్ప సినిమాను ఆదరించే సంస్కృతి మన దేశంలో ఉండాలని ఆకాంక్షించారు.

శివ, గీతాంజలి వంటి క్లాసిక్స్ ను ప్రస్తావించడమే కాకుండా.. నాగార్జున, ఆర్జీవీల పై తనకున్న అభిమానాన్ని నితీష్ తివారీ ఎంతో నిజాయితీగా వ్యక్తపరిచిన తీరు ఆక‌ట్టుకుంది. తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకునేందుకు ఆయన చేసిన ఈ ప్రయత్నం.. ఇరు ప్రాంతాల సినీ పరిశ్రమల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచింది. నవంబర్ 5న విడుదల కానున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అందరూ ఒకేలా ఆదరించి విజయవంతం చేయాలని చిత్ర యూనిట్ కోరుకుంటోంది.