Begin typing your search above and press return to search.

ఆర్జీవీ - రాజ‌మౌళి త‌న‌కు ఎలా స్ఫూర్తి అయ్యారో చెప్పిన 'రామాయ‌ణ' ద‌ర్శ‌కుడు నితీష్ జీ!

న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మించిన ప్రతిష్టాత్మక `రామాయణం` ఈ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 5 న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   19 Oct 2026 10:20 PM IST
ఆర్జీవీ - రాజ‌మౌళి త‌న‌కు ఎలా స్ఫూర్తి అయ్యారో చెప్పిన రామాయ‌ణ ద‌ర్శ‌కుడు నితీష్ జీ!
X

న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మించిన ప్రతిష్టాత్మక `రామాయణం` ఈ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 5 న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు నితీష్ తివారీ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను, సినీ వర్గాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేవలం సినిమా విశేషాలే కాకుండా, తెలుగు చలనచిత్ర పరిశ్రమతో తన చిన్ననాటి అనుబంధాన్ని ఆయన ఎంతో భావోద్వేగంగా షేర్ చేసుకున్నారు. ``మీ సినిమాలు, మా సినిమాలు అనే భేధాలు లేవు.. ఇవన్నీ మన సినిమాలే`` అంటూ ఆయన చెప్పిన మాటలు అందరి మనసులను గెలుచుకున్నాయి.

తన చిన్నతనపు జ్ఞాపకాలను నెరువేసుకుంటూ, తాను స్కూల్లో చదువుతున్న రోజుల్లో తన పట్టణానికి వచ్చిన `శివ` సినిమా తనపై ఏ విధంగా ప్రభావం చూపిందో నితీష్ తివారీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆ నటులు ఎవరో, సినిమా ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియకపోయినా.. హిందీలో ఆ సినిమా చూసి నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, అమల అభినయం, అలాగే భవానీ పాత్రలో రఘువరన్ నటనకు పూర్తిగా ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అంతేకాకుండా అంతటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలుసుకోవాలని ఎంతగానో కుతూహలపడ్డానని ఆయన పేర్కొన్నారు.

తెలుగు సినిమాలపై తనకు ఉన్న‌ మమకారాన్ని చాటుతూ గీతాంజలి, క్షణ క్షణం వంటి చిత్రాలను తాను ఎంతగానో ఆస్వాధించానని నితీష్ తివారీ తెలిపారు. రూమ్ లో త‌న హైద‌రాబాదీ స్నేహితుడు త‌న‌కు తెలుగు సినిమాల‌ను చూపిస్తే, తాను అత‌డికి హిందీ సినిమాలు చూపించాన‌ని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. వేదికపై అందరి కోరిక మేరకు ఆయన `నందికొండ వాగుల్లోనా` పాటను గుర్తుచేసుకుంటూ కొద్దిగా స్వయంగా పాడి వినిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన జ్ఞాపకశక్తిని, తెలుగు సంస్కృతి- సినిమాల‌పై అత‌డు చూపిన ఆదరాభిమానాలను వేదికపై ఉన్నవారందరూ మనసారా ప్రశంసించారు.

ఈ చిత్రాన్ని కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం చేయకుండా పూర్తిగా నూటికి నూరు శాతం అచ్చమైన `భారతీయ (ఇండియన్) సినిమా`గా రూపొందించామని నితీష్ తివారీ స్పష్టం చేశారు. మన హృదయాలకు అత్యంత దగ్గరగా ఉన్న ఈ గొప్ప ఇతిహాసాన్ని ఎంతో గర్వంగా ప్రపంచానికి చూపించాలనేదే తమ అందరి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారు `బాహుబ‌లి`, `ఆర్ఆర్ఆర్` వంటి చిత్రాలతో ఇండియన్ సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టారని.. ఆ స్ఫూర్తితోనే తాము ముందుకు వెళ్తున్నామని కొనియాడారు.

ఈ వేడుకలో భాగంగా `రామాయణం` చిత్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రపంచ స్థాయి ప్రీమియర్‌ను అక్టోబర్ 27వ తేదీన అకాడమీ థియేటర్‌లో నిర్వహించబోతున్నట్లు నితీష్ తివారీ అధికారికంగా వెల్లడించారు. మిలియన్ల కొద్దీ ప్రజలు గొప్పగా కలలు కనేలా, వాటిని సాధించే దిశగా అడుగులు వేసేలా స్ఫూర్తినిచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.