ఆ చెడ్డ అలవాటును రావణుడితో పాటు దహనం చేయాలి!
విజయదశమి పర్వదినం అనగానే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం.
By: Srikanth Kontham | 20 Oct 2026 5:55 PM ISTవిజయదశమి పర్వదినం అనగానే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే ఈ పండుగ సందర్భాన్ని పురస్క రించుకుని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. సమాజంలో రావణుడిని ప్రతీఏటా కాల్చడం ఆనవాయితీ అయినా? మనిషిలోని కొన్ని చెడ్డ అలవాట్లను, ముఖ్యంగా ఈ కాలంలో తీవ్రంగా వేధిస్తున్న సోషల్ మీడియా వ్యసనాన్ని కూడా అదే రీతిలో దహనం చేయాలని పిలుపునిచ్చారు.
కేవలం ఒక పురాణ పాత్రను అంతం చేయడమే పండుగ ఉద్దేశం కాకూడదని నిమ్రత్ అభిప్రాయపడ్డారు. మనిషి జీవితంలో ప్రశాంతతను, సమయాన్ని హరిస్తున్న అతిపెద్ద సమస్యలపై ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇదొక సరైన సమయమని పేర్కొన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ గంటల తరబడి స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతూ సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలపై కాలం వెచ్చిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా యువత తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియా స్క్రోలింగ్లో వృథా చేస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. ఎక్కడికైనా వెళ్లినా? ఏ పండుగ జరుపుకున్నా క్షణక్షణానికి ఫోటోలు, రీల్స్ కోసమే బతుకుతున్నారని, దీనివల్ల నిజమైన జీవితంలోని ఆనందాన్ని, బంధాలను కోల్పోతున్నామని నిమ్రత్ స్పష్టం చేశారు. ఈ అనర్థదాయకమైన అలవాటును ఈ దసరా పండుగ రోజు రావణాసురుడితో పాటు పూర్తిగా దహనం చేసి డిజిటల్ డిటాక్స్ వైపు అడుగులు వేయాలని సూచించారు.
నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న చెడు అలవాట్లు.. సోషల్ మీడియాపై ఆధారపడే తత్త్వం మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. కంటి నిండా నిద్ర లేకపోవడానికి కుటుంబసభ్యులతో గడపాల్సిన సమయం కరిగిపోవడానికి ఈ వ్యసనమే ప్రధాన కారణమని తెలిపారు. రావణ దహనం చూసేటప్పుడు కేవలం బాణసంచా వెలుగులను ఆస్వాదించడం కాకుండా మనలోని ఇలాంటి వ్యర్థమైన అలవాట్లను కూడా అగ్నికి ఆహుతి చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలని ఆకాంక్షించారు.
నటిగా గ్లామర్ ప్రపంచంలో ఉన్నా? వాస్తవ జీవితానికి.. నేటి యువత ప్రవర్తనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిమ్రత్ కౌర్ ఎంతో పరిణతితో విశ్లేషించారు. టెక్నాలజీ అనేది మన అవసరాల కోసమే తప్ప.. మన జీవితాన్ని శాసించే స్థాయికి అది చేరకూడదని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే లైక్లు..కామెంట్ల కోసం ఆరాటపడే బదులు మనుషుల మధ్య జరిగే సంభాషణలను.. అనుబంధాలను ఆస్వాదించాలని కోరారు.
చివరిగా దసరా పండుగ సందర్భంగా నిమ్రత్ కౌర్ ఇచ్చిన సందేశం సమాజంలో మంచి ఆలోచనను రేకెత్తిస్తోంది. చెడుపై మంచి గెలవడం అంటే బాహ్య ప్రపంచంలోని శత్రువులను ఓడించడమే కాకుండా మనసును కమ్ముకున్న డిజిటల్ బానిసత్వాన్ని, చెడ్డ అలవాట్లను అంతం చేయడమే అసలైన విజయ దశమి అని నిరూ పించారు. నిమ్రత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
