సినిమా మార్కెట్‌లో కొత్త ఆఫర్..!
సినిమాలు తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం మరో ఎత్తు అయింది.
By: Ramesh Palla | 21 Feb 2026 11:58 AM ISTసినిమాలు తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం మరో ఎత్తు అయింది. ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్‌లో ఒకటి రెండు వారాల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. సూపర్ హిట్ అయితే మూడు నాలుగు వారాలు థియేటర్‌లో సినిమాలు ఉంటున్నాయి. మొదటి వారం రోజుల్లోనే జనాల దృష్టిని ఆకర్షించాలి, పాజిటివ్ టాక్ దక్కించుకోవాలి. అలా సాధ్యం కాకపోతే మాత్రం వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి సినిమాను థియేటర్ నుంచి తీసి వేసే పరిస్థితి ఉంది. అందుకే విడుదలైన మొదటి రెండు మూడు రోజులు జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. జనాల్లోకి తమ సినిమాను తీసుకు వెళ్ళడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. మొత్తంగా చిన్న సినిమాలను థియేటర్‌లోకి తీసుకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనాల వరకు తీసుకు వెళ్లడం మరో ఎత్తు అయింది.
టికెట్ల రేట్ల విషయంలో...
జనం దృష్టిని ఆకర్షించేందుకు సాధ్యం అయినంత వరకు నిర్మాతలు తమ సినిమా గురించి గొప్పలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో టికెట్ల రేట్లను తగ్గించి పెట్టడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పెద్ద సినిమాలకు మొదటి వారం రోజులు భారీ మొత్తంలో టికెట్ల రేట్లు పెంచుతూ ఉంటే, చిన్న సినిమాలకు మాత్రం టికెట్ల రేట్లు చాలా వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఆ మధ్య ఒక సినిమాను వంద రూపాయల లోపు టికెట్ రేటు పెట్టి జనాల్లోకి తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆ పద్ధతి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో చాలా మంది ఆ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. చిన్న సినిమాలకు సాధారణ సినిమాల టికెట్ల రేట్లతో పోల్చితే తక్కువగా ఉండటం వల్ల జనాలు వస్తారనే అభిప్రాయం ఉంది. అందుకే మరిన్ని సినిమాలు ఇదే ఫార్ములాతో తమ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్తున్నారు.
నిలవే సినిమా టికెట్ రేట్లు...
ఇటీవల విడుదలైన 'నిలవే' అనే సినిమాకు పబ్లిసిటీ బాగానే చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రావడం లేదు. దాంతో హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో ఈ సినిమా రెండు షో ల టికెట్‌ల రేట్లను కేవలం రూ.11లు అంటూ అధికారికంగా ప్రకటించారు. సినిమాను ఎక్కువ మంది చూడటం ద్వారా పబ్లిసిటీ దక్కి, మౌత్ టాక్ తో ఇతర ఏరియాల్లో ఎక్కువ టికెట్లు అమ్ముడు పోతాయి అనే మార్కెట్ స్ట్రాటజీతో నిర్మాతలు ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆలోచన బాగుందని, ఇది ఇండస్ట్రీలో కొత్త మార్కెట్ ట్రిక్, ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో నిలవే యూనిట్ సభ్యులను అభినందిస్తూ కొందరు పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే నిలవే యూనిట్ సభ్యులు పెట్టిన ఆఫర్ కి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్‌లో జనాలు భారీగానే రావడం, సినిమాకు పబ్లిసిటీ జరగడం అంతా వారు అనుకున్నట్లు జరిగిందట.
ఉచితంగా సినిమా టికెట్లు ఇవ్వడం ద్వారా...
ఇలా ఉచితంగా సినిమా టికెట్లు ఇవ్వడం ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో చిన్న సినిమాల టికెట్ల రేట్లు తగ్గించడం ద్వారా పెద్ద సినిమాలపై ఒత్తిడి పెరుగుతుంది అనేది కొందరు నిర్మాతల వాదన, చిన్న సినిమాలను ఆ రేటుకు థియేటర్ లో విడుదల చేసినప్పుడు, పెద్ద సినిమాలను ఎందుకు విడుదల చేయడం లేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రూ.11 ల టికెట్ రేటుతో నిలవే సినిమా రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే టికెట్ ఆఫర్ అనేది కేవలం ఒకే థియేటర్ అది కూడా రెండు షో లకు మాత్రమే కావడంతో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. సినిమాకు ఇలాంటి ఆఫర్ వల్ల ప్రచారం దక్కడంతో పాటు, ఆ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులతో మౌత్ పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే ఈ కొత్త ఆఫర్ ను చాలా మంది ముందు ముందు ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
