నిఖిల్ స్వయంభు.. ఓవర్సీస్ లో నెవ్వర్ బిఫోర్ డీల్
'కార్తికేయ 2' నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ ను ఎలా మార్చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఒక మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న నిఖిల్, ఆ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు.
By: M Prashanth | 29 Nov 2025 6:09 PM IST'కార్తికేయ 2' నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ ను ఎలా మార్చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఒక మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న నిఖిల్, ఆ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మార్కెట్ ను స్టాండర్డ్ గా మార్చుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం 'స్వయంభు'పై ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా జరిగిన ఒక బిజినెస్ డీల్ నిఖిల్ రేంజ్ ను గట్టిగానే హైలెట్ చేస్తోంది.
సాధారణంగా టైర్ 2 హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో ఒక లిమిటెడ్ మార్కెట్ ఉంటుంది. కానీ 'స్వయంభు' ఆ పరిధులు దాటేసింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ. 7 కోట్లకు అమ్ముడయ్యాయట. నిఖిల్ కెరీర్ లోనే ఇది ఆల్ టైమ్ హయ్యెస్ట్ రికార్డ్. ఒక టైర్ 2 హీరో సినిమాకు విడుదలకు ముందే ఈ స్థాయి ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'ఫార్స్ ఫిలిం' ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. సాధారణంగా పెద్ద స్టార్ల సినిమాలను కొనుగోలు చేసే ఈ సంస్థ, నిఖిల్ సినిమాపై ఇంత భారీ మొత్తం వెచ్చించిందంటే.. కంటెంట్ మీద వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా వర్కవుట్ అవుతుందని బయ్యర్లు గట్టిగా నమ్ముతున్నారు.
ఈ భారీ డీల్ కు ప్రధాన కారణం ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోనే అని చెప్పాలి. 'రైజ్ ఆఫ్ స్వయంభు' పేరుతో వదిలిన ఆ వీడియోలో విజువల్స్, యుద్ధ సన్నివేశాలు, నిఖిల్ మేకోవర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది రెగ్యులర్ బడ్జెట్ సినిమా కాదని, ఒక విజువల్ వండర్ అని క్లారిటీ రావడంతో బిజినెస్ వర్గాల్లో హీట్ పెరిగింది.
నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించడం, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. రూ. 7 కోట్ల బిజినెస్ జరగడంతో, ఇప్పుడు సినిమాపై బాధ్యత మరింత పెరిగింది. ఓవర్సీస్ లో ఈ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే సినిమాకు హిట్ టాక్ రావడం చాలా ముఖ్యం.
ఏదేమైనా 'స్వయంభు' బిజినెస్ లెక్కలతో నిఖిల్ తన సత్తా చాటాడు. 2026 ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కూడా ఇదే జోరు చూపిస్తే నిఖిల్ స్టార్ డమ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. ఈ రికార్డు డీల్ తో సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
