'స్వయంభు' ఎక్కడ నిఖిల్?
‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ.
By: Garuda Media | 29 Aug 2025 9:41 AM IST‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ. కానీ దానికి ఫాలోఅప్‌గా అతను సరైన సినిమాలు చేయలేకపోయాడు. ‘18 పేజెస్’ ఓ మాదిరిగా ఆడగా.. పాన్ ఇండియా సినిమాగా హడావుడి చేసిన ‘స్పై’ సినిమా తుస్సుమనిపించేసింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఐతే తన తర్వాతి చిత్రాలైన స్వయంభు, ది ఇండియా హౌస్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాయి. ఇవి రెండూ పీరియడ్ సినిమాలే. పైగా పెద్ద బడ్జెట్లో రూపొందుతున్నవే.
పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయగల సత్తా ఉన్న చిత్రాల్లాగే కనిపించాయి. వీటిలో ‘స్వయంభు’ చాలా స్పెషల్‌గా కనిపించింది. సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు ప్రొడక్షన్లో భరత్ కృష్ణమూర్తి అనే తమిళ దర్శకుడితో ఈ సినిమాను మొదలుపెట్టారు. చోళుల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక యోధుడి కథ ఇది. సినిమా మొదలైనపుడు ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపించింది.
ఐతే కొన్ని రోజులు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చిన చిత్ర బృందం.. కొన్ని నెలలుగా మౌనంగా ఉంది. ఈ సినిమా మొదలై ఏడాది దాటిపోయింది. లెక్క ప్రకారం ఈపాటికి సినిమా రిలీజైపోయి ఉండాలి. కానీ ఇప్పుడు టీం సైలెన్స్ చూస్తుంటే.. ఇప్పుడిప్పుడే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదు. అసలు పూర్తిగా అప్‌డేట్స్ ఎందుకు ఆగిపోయాయి.. షూటింగ్ స్టేటస్ ఏంటి అన్నది అర్థం కావడం లేదు. నిఖిలేమో ఈ మధ్య ‘ఇండియా హౌస్’ షూట్‌లో పాల్గొంటున్నాడు.
కొత్తగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. కానీ ‘స్వయంభు’ గురించి మాత్రం స్పందించడం లేదు. ఇలాంటి పాన్ ఇండియా సినిమా నుంచి అప్‌డేట్స్ ఇవ్వడం, తరచుగా వార్తల్లో నిలబెట్టడం చాలా అవసరం. సినిమా మొదలైన ఏడాదికి కూడా ఇంకా టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీంతో సినిమా అనుకున్నట్లుగా ముందుకు కదులుతోందా.. లేక ఏవైనా కారణాలతో బ్రేక్ పడిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
