Begin typing your search above and press return to search.

మ‌హేష్- ప్ర‌భాస్ బాట‌లో నిఖిల్ ఏం చేసాడంటే?

సాధారణంగా తెలుగు హీరోలు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు వాయిస్ ఓవర్ లేదా డబ్బింగ్ అందిస్తే వారి పారితోషికం రేంజ్ చాలా భారీగా ఉంటుంది.

By:  Sivaji Kontham   |   20 May 2026 6:00 PM IST
మ‌హేష్- ప్ర‌భాస్ బాట‌లో నిఖిల్ ఏం చేసాడంటే?
X

ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్ల‌ను క‌బ్జా చేస్తున్న‌ హాలీవుడ్ కి.. మన టాలీవుడ్‌కు మధ్య అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు హాలీవుడ్ చిత్రాలను ఎంతగానో ఆదరిస్తుండటంతో అక్కడి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తమ సినిమాలను తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా డబ్బింగ్ చేసి విడుద‌ల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మన స్టార్ హీరోల క్రేజ్‌ను ఉపయోగించుకుని పాత్రలకు మరింత వెయిట్ తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. గతంలో అనేకమంది తెలుగు హీరోలు హాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్లకు తమ గాత్రాన్ని (వాయిస్ ఓవర్) అందించి అలరించగా.. ఇప్పుడు ఆ అరుదైన మైలురాయిని అందుకోవడానికి యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రం `హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` లోని ప్రధాన పాత్రకు నిఖిల్ తెలుగు డబ్బింగ్ చెప్పడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. టాలీవుడ్ టాప్ హీరోలు హాలీవుడ్ చిత్రాల డబ్బింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. `ది లయన్ కింగ్` చిత్రంలో ముఫాసా పాత్రకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని వాయిస్ ఇచ్చి మెప్పించారు. అలాగే మార్వెల్ బ్లాక్‌బస్టర్ చిత్రం `అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్`, `ఎండ్‌గేమ్` చిత్రాలలో శక్తివంతమైన విలన్ `థానోస్` పాత్రకు దగ్గుబాటి రానా చెప్పిన డబ్బింగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. అంతకంటే ముందు హాలీవుడ్ విజువల్ వండర్ `అవతార్`మొదటి భాగంలో హీరో పాత్రకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తెలుగు వాయిస్ అందించగా, `స్పైడర్‌మ్యాన్` చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చి రికార్డు సృష్టించారు. కేవలం హీరోలే కాకుండా పలువురు టాలీవుడ్ కథానాయికలు కూడా హాలీవుడ్ లేడీ సూపర్ హీరో పాత్రలకు తమ గొంతును అందించారు. ఇప్పుడు అదే బాటలో నిఖిల్ సిద్ధార్థ్ పవర్‌ఫుల్ `హీ-మ్యాన్` పాత్రకు, విలక్షణ నటుడు ఆదిత్యా మీనన్ క్రూరమైన విలన్`స్కెలిటర్` పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

సాధారణంగా తెలుగు హీరోలు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు వాయిస్ ఓవర్ లేదా డబ్బింగ్ అందిస్తే వారి పారితోషికం రేంజ్ చాలా భారీగా ఉంటుంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు (ఉదాహరణకు అమేజాన్ ఎంజీఎం స్టూడియోస్) తమ బ్రాండ్ ఇమేజ్‌ను మార్కెట్‌లో నిలబెట్టుకోవడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తాయి. మన హీరోలు తమ రెగ్యులర్ సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ రోజులతో లెక్కగడితే.. ఈ హాలీవుడ్ సినిమాల డబ్బింగ్ కోసం కేవలం 3 నుండి 5 రోజుల కాల్షీట్లకు గానూ చాలా విలాసవంతమైన పారితోషికాన్ని అందుకుంటారు. హీరోల క్రేజ్, మార్కెట్ వాల్యూను బట్టి ఈ రెమ్యునరేషన్ కొన్ని లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. `మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` చిత్రంలో అత్యంత పాపులర్ `హీ-మ్యాన్` క్యారెక్టర్‌కు వాయిస్ ఇచ్చినందుకు గానూ నిఖిల్ సిద్ధార్థ్‌కు భారీ మొత్తంలోనే పారితోషికం అందినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. `హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` అనేది దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామిక్స్, యానిమేషన్ ప్రియులను ఊర్రూతలూగించిన ఒక క్లాసిక్ ఫాంటసీ కథ. `ఎటర్నియా` అనే ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని కాపాడే యువరాజు ఆడమ్ తనకు లభించే రహస్య శక్తుల ద్వారా `హీ-మ్యాన్` (ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మానవుడు) గా ఎలా మారాడు అనేదే ఈ సినిమా ముఖ్యాంశం. ఎటర్నియాను, అక్కడి పవిత్రమైన `గ్రేస్కల్ కోట` రహస్యాలను దక్కించుకుని విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసే దుష్టశక్తి `స్కెలిటర్` పన్నే వ్యూహాలను హీ-మ్యాన్ తన స్నేహితులతో కలిసి ఎలా తిప్పికొట్టాడనేదే ఈ చిత్ర కథ. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్ విజువల్ వండర్ ని త‌ల‌పించాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను, యాక్షన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.