Begin typing your search above and press return to search.

నిఖిల్ కూడా వారి దారిలోనే!

టాలీవుడ్‌లో ఓటీటీ విప్లవం రోజురోజుకీ మరింత వేగం అందుకుంటోంది. థియేటర్లతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా స్టార్ హీరోలకు సమాన వేదికలుగా మారుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   27 Feb 2026 1:20 PM IST
నిఖిల్ కూడా వారి దారిలోనే!
X

టాలీవుడ్‌లో ఓటీటీ విప్లవం రోజురోజుకీ మరింత వేగం అందుకుంటోంది. థియేటర్లతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా స్టార్ హీరోలకు సమాన వేదికలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పీరియడ్ యాక్షన్ డ్రామా స్వయంభుతో పాటు పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిఖిల్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు.

ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ప‌లువురు హీరోలు

నిఖిల్ మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాల్లో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అడుగుపెట్టారు. రానా నాయుడు వెబ్‌సిరీస్ తో ఇప్ప‌టికే వెంక‌టేష్, రానా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆడియ‌న్స్ ను అలరించారు. ఇక నాగ చైతన్య దూత అనే వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీలో అడుగుపెట్టి తనలోని ఇంటెన్స్ యాక్టర్‌ను చూపించారు. ఈ సిరీస్‌కు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

ప్ర‌యోగాలు చేయ‌డానికి రెడీ

స‌త్య‌దేవ్ కూడా ప‌లు డిజిటల్ ప్రాజెక్టులతో ఓటీటీలో తన రేంజ్‌ను విస్తరించారు. థియేటర్లలో మాత్రమే కాకుండా, ఓటీటీ వేదికల ద్వారా కథల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కు పెరుగుతున్న ప్రాధాన్యం, పాన్ ఇండియా రీచ్, భాషా అవరోధాల తొలగింపు వంటి అంశాలు స్టార్ హీరోలను ఈ వైపు ఆకర్షిస్తున్నాయి. థియేట్రికల్ మార్కెట్‌కు పరిమితమైన కలెక్షన్లకు బదులుగా, డిజిటల్ ద్వారా గ్లోబల్ ఆడియెన్స్‌ను చేరుకునే అవకాశముండటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇప్పుడు నిఖిల్ కూడా అదే దారిలో అడుగులు వేస్తుండటం విశేషం. ఇప్పటికే కార్తికేయ 3, ది ఇండియా హౌస్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, ఓటీటీ ద్వారా మరింత విభిన్నమైన కథాంశాలను అన్వేషించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే, టాలీవుడ్ హీరోల ఓటీటీ ఎంట్రీలు కేవలం ట్రెండ్ మాత్రమే కాదు, మారుతున్న ప్రేక్షక అభిరుచులకు అనుగుణంగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. థియేటర్ మరియు డిజిటల్ మధ్య గల గీత మాయమవుతున్న ఈ సమయంలో, నిఖిల్ ఓటీటీ డెబ్యూ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.