Begin typing your search above and press return to search.

కార్తికేయ- 3 సంగతేంటి? ఎప్పుడు మొదలు?

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమా కార్తికేయ. మిస్టరీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

By:  M Prashanth   |   28 Jan 2026 10:47 PM IST
కార్తికేయ- 3 సంగతేంటి? ఎప్పుడు మొదలు?
X

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమా కార్తికేయ. మిస్టరీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవాలయాలు, ఆధ్యాత్మిక నేపథ్యం, సస్పెన్స్ అంశాలు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ మూవీ అందుకున్న విజయం గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో. కార్తికేయ ఫస్ట్ పార్ట్‌ ఘన విజయం సాధించడంతో, దానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఆ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అందుకు తగ్గట్టుగానే మూవీ రిజల్ట్ కూడా వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 మంచి వసూళ్లు రాబట్టి, నిఖిల్‌ కు నార్త్ ఇండియాలోప్రత్యేకమైన మార్కెట్‌ ను తెచ్చిపెట్టింది. దీంతో కార్తికేయ సిరీస్ ఆయనకు ఒక బ్రాండ్‌ గా మారిపోయింది. దీంతో కార్తికేయ 3 తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

కొన్ని నెలల క్రితం నిఖిల్.. ఆ సినిమాపై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కార్తికేయ 3 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పిన నిఖిల్, ప్రాజెక్ట్‌ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం స్క్రిప్ట్‌ ను పూర్తి చేసే పనిలో ఉన్నారని, అంతలోపు తాను ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేస్తానని వెల్లడించారు. అయితే కార్తికేయ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఇప్పుడు అదే విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే కార్తికేయ 3 మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కూడా ఆ సినిమాకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కార్తికేయ సిరీస్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాననే ఆశాభావంతో ఉన్నారు.

అయితే ఇప్పుడు కార్తికేయ 3 కోసం చందూ మొండేటి ఎలాంటి కథను ఎంచుకున్నారు? సినిమా స్కేల్ ఎంత ఉండబోతోంది? బడ్జెట్ ఎంత అవుతుంది? అన్న అంశాలపై మేకర్స్ లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ అనుకున్న స్టోరీకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుందో.. షూటింగ్‌ కు ఎన్ని రోజులు పడుతుందో.. టెక్నికల్‌ గా ఎంత స్థాయిలో సినిమాను రూపొందించాలో.. అన్న అంశాలపై చర్చలు జరుగుతున్నాయట.

అదే సమయంలో దర్శకుడు చందూ మొండేటి, హీరో నిఖిల్ ఇద్దరికీ ఇప్పటికే వేర్వేరుగా వివిధ ప్రాజెక్ట్ కమిట్మెంట్లు ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూనే కార్తికేయ 3ను ఎప్పుడు సెట్స్‌ పైకి తీసుకెళ్లాలనే దానిపై ప్లానింగ్ జరుగుతోందట. అన్ని లెక్కలు కుదిరిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కార్తికేయ 3పై స్పష్టత రావాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.