Begin typing your search above and press return to search.

నిహారిక 'రాకాస' ప్రీమియర్‌.. 'మెగా' సందడి చూశారా?

ఇప్పటికే కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌ గా రాకాస సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు

By:  M Prashanth   |   3 April 2026 10:00 AM IST
నిహారిక రాకాస ప్రీమియర్‌.. మెగా సందడి చూశారా?
X

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మరోసారి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌ గా రాకాస సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌ తో కలిసి నిర్మించిన ఆ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు.

సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఆ సినిమా నేడు గ్రాండ్‌ గా విడుదలైంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన రాకాస మూవీకి రిలీజ్‌ కు ముందురోజు రాత్రి నిర్వహించిన ప్రీమియర్ షోలు మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా లవ్, కామెడీ, ఫాంటసీ అంశాలతో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. హైదరాబాద్‌ లో జరిగిన ప్రత్యేక ప్రీమియర్ షోకు మెగా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. నిహారికకు మద్దతుగా సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి దంపతులు, సాయిధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ థియేటర్‌ లో విజిల్స్ వేస్తూ ఉత్సాహాన్ని పెంచడం విశేషం. అలాగే ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రీమియర్‌ కు హాజరై సినిమాను వీక్షించి నిహారికను అభినందించారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా చూసిన అనంతరం హీరో వరుణ్ తేజ్ తన రెస్పాన్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

రాకాస చాలా ఎంటర్టైనింగ్‌ గా ఉందని, ముఖ్యంగా కామెడీ సినిమాకు హైలైట్‌ గా నిలిచిందని పేర్కొన్నారు. నవ్వు ఆపుకోలేని విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. హీరో సంగీత్ శోభన్‌ లో మంచి టాలెంట్ కనిపించిందని ప్రశంసించిన ఆయన, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తమ కామెడీతో ప్రేక్షకులను అలరించారని అన్నారు. దర్శకురాలు మానస శర్మకు, నిర్మాత నిహారికకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచే వచ్చిన పాజిటివ్ టాక్‌ తో రాకాసపై అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ ఎంటర్టైనర్‌ గా రూపొందిన ఆ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. నిర్మాతగా నిహారిక మరోసారి విజయాన్ని అందుకుంటారా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. మొత్తానికి ప్రీమియర్ షోల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న రాకాస బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. ప్రేక్షకుల నుంచి వచ్చే పూర్తి స్థాయి స్పందనతో సినిమా అసలు ఫలితం తేలనుంది.