నిర్మాతగా నిహారిక కొణిదెల అసలైన ప్రయాణం!
మెగా కుటుంబంలోని ఈ ముగ్గురి కలయిక వస్తున్న చిత్రంపై అన్ని వైపులా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది.
By: Srikanth Kontham | 6 Aug 2026 12:23 PM ISTపరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సంకల్పించారు. మెగా కుటుంబం నుంచి వచ్చినా? ఇండస్ట్రీలో తనకంటూ స్వతంత్ర గుర్తింపును సంపాదించుకోవాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో నిర్మాతగా సత్తా చాటిన అమ్మడు కెరీర్‌లో రాబోతున్న కొత్త చిత్రం ఓ మైలురాయిగా నిలవనుంది. గతంలో `కమిటీ కుర్రాళ్లు`, `రాకాస` వంటి విభిన్న చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన వెబ్ సిరీస్‌లను నిర్మించారు.
ఈ ప్రాజెక్ట్‌లన్నీ ఎక్కువగా పరిమిత బడ్జెట్‌తో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ రూపొందించినవే. నూతన నటీనటులు .. సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ అమ్మడు చేసిన ప్రయోగాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ అనుభవమే నిహారికలో పూర్తి స్థాయి పెద్ద సినిమాలను నిర్మించగల నమ్మకాన్ని నింపింది. నిహారిక ప్రొడక్షన్ హౌస్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా `భైరీ` అనే శక్తివంతమైన చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికే పరిమితం కాలేదు. తండ్రి నాగబాబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.
మెగా కుటుంబంలోని ఈ ముగ్గురి కలయిక వస్తున్న చిత్రంపై అన్ని వైపులా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది.
అయితే నిర్మాతగా నిహారిక అసలు సిసలు పరీక్షను ఎదుర్కొంటోందన్నది అంతే వాస్తవం. ఈ భారీ బడ్జెట్ సినిమాతో అమ్మడు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోతుంది. మెగా కుటుంబంలోని ఇతర హీరోలతో పాటు, బయటి స్టార్ హీరోలు కూడా ఆమెకు డేట్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఒక నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్రశ్రేణి నిర్మాత స్థాయికి ఎదిగేందుకు ఈ చిత్రం అత్యంత కీలకమైన మలుపు కానుంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు మహిళా నిర్మాతలు అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. `భైరీ` సక్సెస్ సాధిస్తే నిహారిక కూడా ఆ లీడింగ్ లేడీ నిర్మాతలకు గట్టి పోటీదారుగా నిలవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. విజయంతో ప్రశంసలు ఎంతో సంతోషాన్ని అందిస్తాయో? విమర్శలయకు అంతకు నాలిగింతలు కృంగదీస్తాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడినప్పుడే మార్కెట్ లో స్థిరంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రయాణంలో రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లడం అంతే కీలకం. ఇక్కడ ఓటమిని ఒప్పుకోని వాళ్లు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఎంత సహకారం ఉన్నా? అది కొంత వరకే పని చేస్తుంది. ఆ తర్వాత ట్యాలెంట్ తోనే నెట్టుకురావాలి. నిహారికకు ఇప్పటికే ఇండస్ట్రీ అంటే కొంత అనుభవం ఉంది కాబట్టి వీటన్నింటిని సునాయాసంగానే దాటేస్తుందని అభిమానులంతా బలంగా నమ్ముతున్నారు. నిహారిక నిర్మాతగా సక్సెస్ అయితే? మెగా ఫ్యామిలీ..అభిమానుల ఆనందానికి అవదులుండవ్.
