నిధి అగర్వాల్ ఘటన.. AI హెల్ప్ తీసుకుంటున్నారా?
అయితే ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.
By: M Prashanth | 19 Dec 2025 1:30 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలోని రెండో సింగిల్ సహన సహన సాంగ్ లాంచ్ ఈవెంట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. పాట లాంచ్ కోసం బుధవారం నాడు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ప్రముఖ లులు షాపింగ్ మాల్ లో ప్రత్యేక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్.
ఆ కార్యక్రమానికి సినిమా దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హాజరయ్యారు. అయితే ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. హీరోయిన్లతో సెల్ఫీలు దిగాలనే ఉత్సాహంతో కొందరు అభిమానులు హద్దు మీరి బిహేవ్ చేశారు.
ఏకంగా స్టేజ్ వద్దకు దగ్గరకు మరికొందరు వెళ్లిపోయారు. దీంతో అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఈవెంట్ ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ బయటకు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆమె తన కారు వద్దకు వెళ్తుండగా.. అప్పటికే మాల్ లో ఉన్న పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ ప్రియులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.
నిధి అగర్వాల్ తో కొందరు అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించినట్లు వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన నిధి.. ఎలాగోలా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆమె ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మొత్తం ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అదే సమయంలో ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. సరైన అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించారనే ఆరోపణలతో మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు విచారణలో పోలీసులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటున్నట్లు వినికిడి.
ఘటనలో హీరోయిన్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు ఏఐ టెక్నాలజీ సహాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతోపాటు మాల్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను తీసుకుని ఏఐ ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారని సమాచారం.
ఇప్పటివరకు, నిధి అగర్వాల్ గాని, రాజా సాబ్ చిత్ర నిర్మాతలు గాని ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ పోలీసులు మాత్రం విచారణ ప్రారంభించారు. అయితే ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు సినీ ప్రియులు, నెటిజన్లు, నిధి అగర్వాల్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
