స్టార్ల పక్కన ఫ్లాపులొచ్చినా ఆగని ఆఫర్లు
సినిమా ఇండస్ట్రీలో ఒకట్రెండు ఫ్లాపులు పడితేనే హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయే రోజులివి.
By: M Prashanth | 28 Oct 2026 7:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఒకట్రెండు ఫ్లాపులు పడితేనే హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయే రోజులివి. కానీ నిధి అగర్వాల్ కథ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పడకపోయినా, ఆమె డైరీలో ఉన్న ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. భారీ చిత్రాలు చేతిలో ఉన్నప్పుడు మార్కెట్ ఊపందుకోవడం సహజం, కానీ బాక్సాఫీస్ దగ్గర ఫలితాలు తేడా కొట్టినా నిధి డిమాండ్ తగ్గకపోవడం టాలీవుడ్ లో ఒక సరికొత్త మిస్టరీలా మారింది.
నిజానికి పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', ప్రభాస్ 'ది రాజా సాబ్' లాంటి భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కడం ఏ హీరోయిన్ కైనా గోల్డెన్ ఆఫర్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఏళ్ల తరబడి సాగిన ఈ భారీ ప్రాజెక్టుల షూటింగులు ఆమె కెరీర్ ప్రైమ్ టైమ్ ను తినేశాయి తప్ప ఆమె ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లలేకపోయాయి. పైగా 'హరిహర వీరమల్లు' పూర్తయ్యే వరకు ఇతర సినిమాలు ఒప్పుకోకూడదనే కాంట్రాక్ట్ కూడా ఉండేది. 'ది రాజా సాబ్'ను సైతం నిర్మాతల అనుమతితోనే అంగీకరించారు.
ఒకవైపు అనూహ్యమైన జాప్యం, మరోవైపు రిలీజైనవి ఆశించిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఎవరైనా అయితే సైలెంట్ అయిపోయేవారు. కానీ నిధి మాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇక్కడే నిధి తన కెరీర్ ప్లానింగ్ ను చాలా తెలివిగా మార్చుకుంది. కేవలం టాలీవుడ్ పైనే పూర్తిగా ఆధారపడకుండా ఒకేసారి మూడు ఇండస్ట్రీలపై కన్నేసింది. బాలీవుడ్ లో ఏకంగా మూడు ప్రాజెక్టులు, కోలీవుడ్ లో మరో చిత్రం చేస్తూ నార్త్, సౌత్ రెండింటినీ కవర్ చేస్తోంది.
ఒకే చోట ఆగిపోతే కాంపిటీషన్ లో వెనకబడిపోతామనే రియాలిటీని ముందే పసిగట్టి, పక్క భాషల్లో కూడా తన ప్రెజెన్స్ ఉండేలా జాగ్రత్త పడుతోంది. తెలుగులో కూడా ఆమె ఆలోచనా తీరు మారినట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన కేవలం రెండు పాటలు, నాలుగు సీన్లకు మాత్రమే పరిమితమయ్యే గ్లామర్ రోల్స్ ను పక్కనపెట్టేస్తోంది. సింపుల్ లవ్ స్టోరీ చేయాలనే ఆసక్తి చూపిస్తూనే, పూర్తిగా తన భుజాలపై నడిచే ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం ఆమె తీసుకున్న మంచి నిర్ణయం.
కేవలం గ్లామర్ మీదే కాకుండా నటనకు స్కోప్ ఉండే పాత్రలు చేస్తేనే లాంగ్ రన్ ఉంటుందని గ్రహించింది. ప్రస్తుతం మూడు హిందీ, రెండు తెలుగు, ఒక తమిళ చిత్రంతో మొత్తం ఆరు ప్రాజెక్టుల లైనప్ సెట్ చేసుకుంది. హిట్లు లేకపోతే కొత్త అవకాశాలు రావడం గగనమైపోయే ఈ పోటీ ప్రపంచంలో, ఈ స్థాయిలో ప్రాజెక్టులు దక్కించుకోవడం ఆమె కెరీర్ కు ఊరటనిచ్చే అంశం. కథ ఏదైనా సరే గ్లామర్ తో పాటు స్క్రీన్ మీద ఒక ఫ్రెష్ వైబ్ ఇవ్వగలదనే నమ్మకాన్ని ఈ సినిమాలతో నిలబెట్టుకోవాల్సి ఉంది.
అయితే ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నామనే దానికంటే చివరకు బాక్సాఫీస్ వద్ద ఎన్ని టికెట్లు తెగాయన్నదే లెక్క. లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, అందులోంచి ఒకటి రెండు డీసెంట్ హిట్లు పడితేనే ఆమె పొజిషన్ కు అసలైన బలం చేకూరుతుంది. మరి రాబోయే ఈ క్రేజీ సినిమాలతో నిధి కమర్షియల్ విక్టరీ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.
