భర్తను విలన్ గా లాంచ్ చేస్తోందా?
వైవిధ్యమైన పాత్రలతో, లేడీ విలన్‌గా వెండితెరపై తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్.
By: Srikanth Kontham | 27 Jun 2026 1:04 PM ISTవైవిధ్యమైన పాత్రలతో, లేడీ విలన్‌గా వెండితెరపై తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకురాలిగా బిజీగా సాగుతున్న అమ్మడి వ్యక్తిగత జీవితం కూడా నెట్టింట కనిపిస్తన్నదే. నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తోంది. తాజాగా వరలక్ష్మి భర్తను కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోందనే కోలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది.
కోలీవుడ్‌లో సీనియర్ నటుడు శరత్‌కుమార్ వారసురాలిగా అడుగుపెట్టి స్వయంకృషితో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వరలక్ష్మికి పరిశ్రమలో అపారమైన అనుభవం , దర్శకులతో మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ను కోలీవుడ్‌లో పవర్‌ఫుల్ విలన్‌గా లాంచ్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పరిశ్రమలో హీరోల వారసులు లేదా హీరోయిన్ల సోదరులు ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. కానీ భర్తను విలన్ పాత్ర ద్వారా చిత్రసీమకు పరిచయం చేయడానికి ఒక స్టార్ నటి రంగంలోకి దిగడం అనేది తమిళ చిత్రసీమలో సరికొత్త చర్చకు దారితీసింది.
ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో విలన్ పాత్రల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. రగ్గడ్ లుక్స్‌తో పాటు మంచి పర్సనాలిటీ, స్టైలిష్ అప్పియరెన్స్ ఉన్న ప్రతినాయకులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నికోలాయ్ సచ్‌దేవ్ పర్సనాలిటీ, ఆయన షార్ప్ ఫీచర్స్ చూస్తుంటే నేటి తరం సరికొత్త కార్పొరేట్ .. స్టైలిష్ విలన్ పాత్రలకు పక్కాగా సరిపోతారని నెటిజన్లు సైతం అభిప్రాయ పడుతున్నారు. వరలక్ష్మి స్వయంగా నెగెటివ్ పాత్రల్లో మెప్పించడంలో సిద్ధహస్తురాలు . కాబట్టి విలనిజానికి ఉండే ప్రాధాన్యతను ముందే గ్రహించి భర్త కోసం ప్రాధాన్యత ఉన్న నెగెటివ్ రోల్ ని పర్పెక్ట్ లాంచింగ్ గా భావిస్తోంది.
నికోలాయ్ సచ్‌దేవ్ వ్యాపార రంగంలో స్థిరపడినప్పటికీ వరలక్ష్మితో వివాహం తర్వాత ఆయనకు సినిమా రంగంపై ఇక్కడి వాతావరణంపై మంచి అవగాహన ఏర్పడింది. పెళ్లైన కొత్తలో ఈ జోడీ తెలుగు, తమిళ పరిశ్రమలు ఎలా చుట్టారో తెలిసిందే. అప్పటి నుంచి నికోలాయ్ సచ్ దేవ్ తరుచూ చెన్నై, హైదరాబాద్ రావడం జరుగుతోంది.ఆ సమయంలో వరలక్ష్మితో కలిసి సినిమా వాళ్లకు టచ్ లో కి వస్తున్నారు. ఆరకమైన ఆకర్షణే ఇప్పుడతడిని నటన వైపు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రచారంపై వరలక్ష్మి శరత్‌కుమార్ ...నికోలాయ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఈ లాంచ్ గనుక నిజమైతే రీల్ లైఫ్‌లో విలనిజంతో మెప్పించిన వరలక్ష్మి గైడెన్స్‌లో నికోలాయ్ ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద భయపెట్టగలడో చూడాలి. ఏదేమైనా భర్తను ప్రతినాయకుడిగా పరిచయం చేయాలనుకునే వరలక్ష్మి ఆలోచన నిజంగానే వైవిధ్యమైనదని క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో? చూడాలి.
