చైనా వాల్ దాటిన 'మిరాయ్' పాప
చూస్తుండగానే చైనా వాల్ దాటేయబోతోంది ఈ కొత్తమ్మాయ్. `మిరాయ్` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా దేశాలన్నీ చుట్టేయబోతోంది.
By: Sivaji Kontham | 8 Sept 2025 9:58 PM ISTచూస్తుండగానే చైనా వాల్ దాటేయబోతోంది ఈ కొత్తమ్మాయ్. `మిరాయ్` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా దేశాలన్నీ చుట్టేయబోతోంది. ముంబైలో ఒక్క ఛాన్స్ అంటూ అవకాశాల కోసం వెతికిన ఈ మోడల్ కం నటి, ఉన్నట్టుండి తేజ సజ్జా సినిమాతో వరల్డ్ ఫేమస్ కాబోతోంది. కొత్తమ్మాయ్ అయినా కానీ తనవైన వన్నె చిన్నెలు, గ్లామరస్ లుక్ తో మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఏ నోట విన్నా ఈ అమ్మడి లక్ గురించే గుసగుస.
పేరు రితిక నాయక్. ఢిల్లీలోని ఒడియా కుటుంబంలో జన్మించిన ఈ ప్రతిభావని టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ యొక్క 12వ సీజన్‌ను గెలుచుకున్న తర్వాత వినోద పరిశ్రమలో బిగ్ డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడానికి ప్రయాణం ప్రారంభించింది. కాలేజ్ డేస్ నుంచే నటన అంటే ఈ భామకు ఆసక్తి.
ఆరంభం `అశోక వనంలో అర్జున కళ్యాణం` (2022)తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో వసుధగా తనదైన అద్భుత నటనతో యువతరాన్ని ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో రితిక నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత రవితేజ ఈగిల్ లో కీలక పాత్ర పోషించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు.
ఇప్పుడు `మిరాయ్` చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైపోతోంది. హనుమాన్ చిత్రంతో తేజ సజ్జా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు ఇది ఈ భామకు కూడా కలిసొస్తోంది. మిరాయ్ కథ, విజువలైజేషన్ పాన్ ఇండియా అప్పీల్ తో అలరించడంతో మార్కెట్లో ఈ మూవీపై బోలెడంత బజ్ పెరిగింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, తేజ సజ్జాతో పాటు రితిక నాయక్ దశ తిరిగిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి కొత్తమ్మాయే అయినా, సినిమా రిలీజ్ తర్వాత అమాంతం తన రేంజ్ మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక రితిక ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలోను అవకాశం అందుకుంది. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రారంభమైంది. చూస్తుండగానే మిరాయ్ పాప చైనా వాల్ దాటేస్తోంది.. దేవీశ్రీ పాడిన పాటలోని ఒక అద్భుతమైన సింగిల్ లైనర్ వర్ణనలా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.
