Begin typing your search above and press return to search.

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

భారతీయ సినిమాల్లో ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. స్పై యాక్షన్, ఫాంటసీ, హారర్ కామెడీలతో పాటు నిజజీవిత కథలు, బయోపిక్‌లు, క్రీడా నేపథ్య చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. సామాన్యుల పోరాటాలు, క్రీడాకారుల విజయాల వెనుక ఉన్న కష్టాలను చూపించే కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మూస ధోరణికి భిన్నంగా సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం వంటి కొత్త అంశాలపై సినిమాలు రావాల్సిన అవసరం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   6 Nov 2026 6:00 AM IST
ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!
X

ఒక‌ప్పుడు యాక్ష‌న్ - ఫ్యాక్ష‌న్.. ల‌వ్ - రొమాన్స్.. హార‌ర్- టెర్ర‌ర్, కామెడీలు, రోమ్ - కామ్ లు అంటూ మాట్లాడుకునేవారు. ఆ త‌ర్వాత ఫాంట‌సీ, సోషియో ఫాంట‌సీ అంటూ కొత్త జాన‌ర్ ల‌ను కూడా మ‌న ద‌ర్శ‌కులు ఎస్టాబ్లిష్ చేసారు. ఇటీవ‌లి కాలంలో స్పై యూనివ‌ర్శ్ లు.. క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లు లేదా హార‌ర్ కామెడీ జాన‌ర్ సినిమాలు అద్భుతంగా ఆడాయి. బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపించాయి. కానీ ఇవేనా జాన‌ర్ లు.. ఇంకా ఏవైనా ఉన్నాయా? అంటే బ‌యోపిక్ ల‌కు కూడా ఆద‌ర‌ణ గొప్ప‌గా పెరిగింది. బార్డ‌ర్ ట‌ర్ర‌రిజం నేప‌థ్య సినిమాల‌కు ఆద‌ర‌ణ ఎప్పుడూ గొప్ప‌గానే ఉంది. అంత‌కుమించి ఇంకా ఏవైనా సినిమా క‌థ‌ల్లో మార్పులు వ‌స్తున్నాయా? అన్న‌ది విశ్లేషించాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమను నిశితంగా పరిశీలిస్తే.. ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో .. సినిమా వీక్షణ అనుభవంలో స్పష్టమైన పరిణతి కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం భారీ అట్టహాసాలు, కలర్‌ఫుల్ పాటలు, విపరీతమైన ఫిక్షన్ యాక్షన్ డ్రామాలకే పరిమితమైన బాక్సాఫీస్ విజయం.. నేడు నిజజీవిత స్ఫూర్తిదాయక కథలకు, సామాన్యుల పట్టుదల, పోరాటాలను ప్రతిబింబించే చిత్రాలకు పట్టం గడుతోంది. తెరపై చూసే కథలో నిజాయితీ, మానవీయ విలువలు ఉన్నప్పుడు ప్రేక్షకులు వాటిని తమ సొంత కథలుగా భావించి బ్రహ్మరథం పడుతున్నారని పదే పదే నిరూపితమవుతోంది.

సినిమా అంటే కేవలం స్పై యాక్షన్ డ్రామాలు, దేశభక్తి చిత్రాలు లేదా ఊహాజనిత ఫాంటసీలు మాత్రమే కాదు. కటిక దారిద్య్రం నుండి ఆశయాల శిఖరాలను అధిరోహించిన సామాన్యుల గాథలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాత్మక మైలేజ్ సాధించగలవని ఇటీవలి విజయాలు స్పష్టం చేస్తున్నాయి. చదువు కోసం పోరాడిన ఓ సాధారణ యువకుడి జీవితం నుండి మొదలుకొని.. సామాజిక మార్పు కోసం కృషి చేసిన వ్యక్తుల కథల వరకు తెరపైకి వచ్చినప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. స్టార్‌డమ్‌ కంటే కూడా కథలోని బలం.. పాత్రలోని సజీవత్వానికే ప్రాధాన్యమిస్తూ నటీనటుల అభినయాన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు.

ఈ నిజజీవిత కథల ఆదరణలో క్రీడా నేపథ్య చిత్రాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. మైదానంలో ఆటగాళ్లు సాధించే విజయాల వెనుక ఉండే కన్నీళ్లు, ఓటములు, ఆధిపత్యాలపై పోరాటాలు, వ్యక్తిగత త్యాగాలను ఆవిష్కరించే క్రీడా నేప‌థ్య‌ కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం క్రీడను మాత్రమే కాకుండా.. ఒక మారుమూల గ్రామం నుండి లేదా నిరుపేద కుటుంబం నుండి వచ్చిన క్రీడాకారుడు దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగాడనే మానవీయ కోణమే ఈ సినిమాలను బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలబెడుతోంది. ఇక్క‌డ క్రీడ‌లో రాణించిన వ్య‌క్తి ఏ నేప‌థ్యం క‌లిగి ఉన్నాడు? అన్న‌దే ఆస‌క్తిక‌ర‌మైన ఎలిమెంట్.

మారుతున్న ప్రేక్షకుడి అభిరుచి భారతీయ సినీ పరిశ్రమకు ఒక గొప్ప అవకాశంతో పాటు బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది. కేవలం ఫార్ములా సినిమాలకే పరిమితం కాకుండా.. సమాజంలోని ర‌క‌రకాల జానర్ల కథలను వెలికితీయాల్సిన అవసరం ఫిలింమేక‌ర్స్ కి ఎంతైనా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్కియాలజీ, వైద్యాభివృద్ధి, సామాజిక విప్లవాలు, పర్యావరణ పరిరక్షణ, స‌ముద్రంలో అద్భుతాలు లేదా ఆకాశంలో, గురు గ్ర‌హంలో జ‌రిగే క‌థ‌ల‌ను కూడా ఇక‌పై సృజించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో అంశాలలో ఎందరో మహానుభావుల నిజ జీవితాలు సినిమా రంగానికి అపరిమితమైన కథావస్తువులను అందిస్తున్నాయి. ఇటువంటి కథలకు తెరరూపం ఇచ్చినప్పుడు కథనంలో నిజాయితీ ఉంటే ప్రేక్షకులు కచ్ఛితంగా ఆదరిస్తారని రుజువవుతోంది. కామెరూన్ క్రియేటివిటీ లోంచి పుట్టిన అవ‌తార్ ల‌ను మించిన ఇంకేదైనా ఫిక్ష‌న్ క‌థ‌ల్ని కూడా భార‌తీయ ఫిలింమేక‌ర్స్ సృజించాల్సి ఉంటుంది. ఆ దిశ‌గా రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కుల‌కు ఆస్కారం లేక‌పోలేదు.

భారతీయ సినిమాని నిశితంగా ప‌రిశీలిస్తే.. నేటి జెన్ జీ వ‌ర‌ల్డ్ లో సాగిస్తున్న‌ ప్రయాణం అత్యంత ఆరోగ్యకరమైన దిశలో సాగుతోంది. నిజ జీవిత ప్రేరేపిత కథలకు లభిస్తున్న ఆదరణ పరిశ్రమలో కొత్త తరం రచయితలకు, దర్శకులకు, నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. వాణిజ్య అంశాల పేరుతో కేవలం మూస ధోరణి సినిమాలే కాకుండా.. ప్రేక్షకుల గుండెలను తాకే... ఆలోజింపజేసే .. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే నిజమైన కథలను తెరకెక్కించడమే నేటి చలనచిత్ర పరిశ్రమ ముందున్న ప్రధాన లక్ష్యం.