అభిమానులు కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారా?
ఒకప్పుడు హీరోలపై అభిమానం అనేది ఓ ఉద్వేగభరితమైన ప్రయాణంలా కనిపించేది. వెండి తెరపై అభిమాన హీరో కనిపించగానే ఈలలు, కేకలు మాత్రమే కాదు వారి కోసం ప్రాణాలిచ్చే స్థాయికి వెళ్లేవారు.
By: Srikanth Kontham | 8 July 2026 9:00 AM ISTఒకప్పుడు హీరోలపై అభిమానం అనేది ఓ ఉద్వేగభరితమైన ప్రయాణంలా కనిపించేది. వెండి తెరపై అభిమాన హీరో కనిపించగానే ఈలలు, కేకలు మాత్రమే కాదు వారి కోసం ప్రాణాలిచ్చే స్థాయికి వెళ్లేవారు. తమ హీరోని తక్కువ చేసి మాట్లాడితే ప్రత్యర్థి అభిమానులతో గొడవలు పడటం.. ఆవేశంతో ఊగిపోవడం సర్వసాధారణంగా కనిపించేది. సినిమా అనేది వినోదం మాత్రమే కాదని తమ జీవితంలో ఓ భాగంగా భావించే స్థాయికి అభిమానం హద్దులు దాటేది.
కానీ కాలం మారుతోన్న కొద్దీ అభిమానుల ఆలోచనా విధానం కూడా వేగంగా మారుతోందన్నది అంతే వాస్తవం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానుల ప్రవర్తనలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి.
అంధాభిమానం కంటే ఇప్పుడు విశ్లేషణకు ప్రాధాన్యత పెరిగింది. సినిమా నచ్చకపోతే తమ అభిమాన హీరో అయినా సరే నిర్మొహమాటంగా విమర్శించే ధైర్యం నేటి యువతరం అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో అభిమానులు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. సినిమా అనేది వ్యాపారం అని.. అది కేవలం నటుల నటనపై మాత్రమే ఆధారపడి ఉండదని గ్రహించారు. కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే వంటి అంశాల్లో లోపాలుంటే వాటిని వేలెత్తి చూపడంలో వెనుకాడటం లేదు. హీరోల వ్యక్తిగత జీవితం కంటే వారి వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంచుకునే కథలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఈ మార్పుకు ప్రధాన కారణం విజ్ఞానాన్ని అందించే సాంకేతికత పెరగడమే. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్త సినిమా ప్రమాణాలు ప్రేక్షకుల కళ్ల ముందున్నాయి. దీనివల్ల హీరోల సినిమాలను కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోల్చి చూస్తున్నారు. హీరో ఇమేజ్ కోసం కాకుండా కంటెంట్ బాగుంటేనే సినిమాను ఆదరిస్తామనే సంకేతాలను స్పష్టంగా ఇస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చలు కూడా అభిమానుల మధ్య అవగాహనను పెంచుతున్నాయి.
వేర్వేరు హీరోల అభిమానులు ఒకే వేదికపై చర్చించుకోవడం, సినిమాల గురించి పరస్పరం అభిప్రాయాలు పంచుకో వడం వల్ల వాదనుల ధోరణులు తగ్గాయి. అనవసరమైన గొడవలు, పంతాలు పట్టుకోవడం వల్ల తమకు లేదా తమ అభిమాన హీరోలకు ఎలాంటి లాభం లేదని అది సమయం వృధా అని చాలామంది హీరోల అభిమానలులు గుర్తిస్తున్నారు
మొత్తంగా హీరోలపై అభిమానం ఇప్పుడు సంకుచిత భావాల నుంచి బయటపడి విజ్ఞాన మార్గంలోకి ప్రయాణిస్తోంది. హీరోను దైవంలా కాకుండా.. ఒక నటుడిగా , కళాకారుడిగా చూడటం పరిణతి చెందిన అభిమానానికి నిదర్శనం. ప్రాక్టికల్‌గా ఆలోచించే తరం పెరగడం సినీ పరిశ్రమకు కూడా మంచిదే. ఎందుకంటే? కంటెంట్ ఉన్న చిత్రాలే గెలుస్తాయన్న భయం నటుల్లో ఉంటేనే మరింత మెరుగైన సినిమాలను అందించగలరు. అభిమానులున్నారని ఇష్టారీతున సినిమాలు చేస్తే? ధీటైన బధులు కూడా ఇస్తారని హీరోలు అలెర్ట్ అవుతున్నారు.
