Begin typing your search above and press return to search.

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

సాత్విక వీరవల్లి, అనస్వర రాజన్, మమితా బైజు గ్లామర్ పాత్రలకంటే కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘ఇట్లు అర్జున’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో తమ నటనకు గుర్తింపు తెచ్చుకుంటూ, పరిశ్రమలో దీర్ఘకాలం కొనసాగేందుకు కెరీర్‌ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

By:  Srikanth Kontham   |   21 Nov 2026 2:05 PM IST
పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!
X

గ్లామర్ పాత్రల పాకులాడే రోజులు పోయి కథలో బరువున్న.. భావోద్వేగాలకు చోటున్న పాత్రల వైపే నేటి యువ నటీమణులు అడుగులు వేస్తున్నారు. స్క్రీన్ టైమ్ ఎంత ఉందనే దానికంటే? ఉన్నంత సేపు ప్రేక్షకుల మ‌న‌సులో నిలిచిపోయే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాత్విక వీరవల్లి, అనస్వర రాజన్, మమితా బైజు వంటి హీరోయిన్ల సినిమాల ఎంపికను గమనిస్తే ఈ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన `ఆకాశంలో ఒక తార' చిత్రంతో సాత్విక వీరవల్లి చేసిన ప్రయత్నం ఈ కోవకే చెందుతుంది. కలలను చేరుకునే ప్రయాణంలో ఆశయాలు.. కుటుంబ బంధాల మధ్య సాగే భావోద్వేగ పాత్రలో అమ్మ‌డు చూపించిన పరిణతి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఒదిగిపోయిన తీరు.. కథకు బలాన్ని చేకూర్చింది. అనస్వర రాజన్ సైతం వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రత్యేకతను చాటుకుంటోంది. `ఇట్లు అర్జున`లో బలమైన పాత్రతో మెప్పించిన సొగ‌స‌రి సెట్‌లో ఉన్న `కాకా` ప్రాజెక్టులోనూ అంతే ప్రాధాన్యమున్న పాత్రలో అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. ఇక మమితా బైజు ఎంపికలు కూడా రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఉంటున్నాయి. `డ్యూడ్`, `జననాయగన్`, `విశ్వనాథ్ అండ్ సన్స్` వంటి చిత్రాల్లో కథకు అవసరమైన బలమైన పాత్రలతో ఎలా ముందుకెళ్తుందో క‌నిపిస్తూనే ఉంది.

పెద్ద స్టార్లు.. విభిన్న కథాంశాల మధ్యలోనూ పాత్రకున్న ప్రాముఖ్యతను గుర్తించి సంతకాలు చేస్తోంది. ఈ ముగ్గురు భామ‌లు ఎంపిక విష‌యంలో ఎంతో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. సీనియ‌ర్ నాయిక‌లు..కొత్త‌గా వ‌స్తోన్న భామ‌ల నుంచి పోటీ ప‌డాలంటే? ఆ మాత్రం స్ట్రాట‌జీ త‌ప్ప‌దు. ఇలా ఆలోచించే నాయిక‌లు చాలా అరుదుగా ఉంటారు. పాత్ర‌తో ప‌నేంటి కోట్లు ఇస్తున్నారు క‌దా? అని ఎలాంటి పాత్ర‌లు ప‌డితే అలాంటి వాటికి క‌మిట్ అయి ఏడాది..రెండేళ్‌లు ప‌నిచేసి వెళ్లిపోయేవాళ్ల‌లా కాకుండా ఇండ‌స్ట్రీలో లాంగ్ ర‌న్ లో నిల‌బ‌డేలా కెరీర్ ప్లాన్ చేసుకుని ముందుకు సాగ‌డం విశేషం.

ప్ర‌స్తుతం జెన్ జీ త‌రంది కాబ‌ట్టి సీనియ‌ర్ బ్యూటీల హ‌వా ఇప్ప‌టికే త‌గ్గుముఖం ప‌ట్టింది. న్యూ ఏజ్ సినిమాల్లో హీరోయిన్లు అంటే ఈ త‌రానికి త‌గ్గ వాళ్లే సెట్ అవుతారు. సీనియ‌ర్లు సెల‌క్టివ్ గా ఉంటారు కాబ‌ట్టి వాళ్ల నుంచి పెద్ద‌గా పోటీ కూడా ఉండ‌దు. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే ఈ ముగ్గురు భామ‌లు తెలివిగా కెరీర్ ని ప్లాన్ చేసుకుని మందుకెళ్తున్నారు.