వర్కింగ్ హవర్స్ పై కొత్త వాళ్లు సైలెంట్!
సినీ పరిశ్రమలో పని గంటల వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పటికే దీపికా పదుకొణే, కంగనా రనౌత్ సహా చాలా మంది హీరోయిన్లు ఎనిమిది గంటల పని విధానానికే కట్టుబడి ఉన్నారు.
By: Srikanth Kontham | 21 April 2026 10:00 PM ISTసినీ పరిశ్రమలో పని గంటల వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పటికే దీపికా పదుకొణే, కంగనా రనౌత్ సహా చాలా మంది హీరోయిన్లు ఎనిమిది గంటల పని విధానానికే కట్టుబడి ఉన్నారు. అంతకుమించి పని చేయడం ఏ నటికైనా కష్టంగానే ఉంటుందని... అధిక పనుగంటలు అనేవి అరోగ్య సమస్యలకు దారి తీస్తాయని ఈ విధానం మారాలని గళమెత్తిన సందర్భాలెన్నో. ఆ కారణంగానే దీపికా పదుకొణే `కల్కి 2 `ప్రాజెక్ట్ నుంచి నిరభ్యంతరంగా తప్పుకుంది. అయితే తాజాగా పరిశ్రమలో ఓ కొత్త వాదన వినిపిస్తోంది. సినీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టే హీరోయిన్లు పని గంటల విషయంలో మౌనంగా ఉండి ఎక్కువ సమయం షూటింగ్‌లో గడిపితేనే వృత్తిపరంగా రాటుదేలగలరని కొందరు భావిస్తున్నారు.
సుదీర్ఘ కాలం పని చేయడం వల్ల సినిమా నిర్మాణ ప్రక్రియపై పూర్తి అవగాహన వస్తుందన్నది అభిప్రాయ పడుతున్నారు. నేడు స్టార్ హీరోయిన్లు, సీనియర్ నటీమణులు అందరూ ఒకప్పుడు రోజుకు 10 నుండి 12 గంటల పాటు కష్టపడి పనిచేసిన వారే. షూటింగ్ స్పాట్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల దర్శకుడి విజన్ ఏంటి? కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటాయి? లైటింగ్ ప్రభావం ఎలా ఉంటుందనే? విషయాలను ప్రాక్టికల్‌గా నేర్చుకోగలిగారు. ఆ కష్టమే వారిని నేడు గొప్ప నటీమణులుగా, స్టార్‌లుగా తీర్చిదిద్దింది. కష్టపడే తత్వమే వారిని పరిశ్రమలో సుస్థిర స్థానానికి చేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లుగా చలామణీ అవుతున్న వారు మాత్రం తమ పని గంటలను ఎనిమిది గంటలకే పరిమితం చేయాలని కోరుతున్నారు. శారీరక శ్రమను తగ్గించుకోవడానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి ఇది అవసరమని భావిస్తారు. కానీ ఇదే సూత్రాన్ని ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న హీరోయిన్లు కూడా అనుసరిస్తే? వారు నేర్చుకునే ప్రక్రియ నెమ్మదించే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. కొత్తవారు పని గంటల విషయంలో ఎలాంటి పరిమితులు విధించకుండా కష్టపడితేనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు.
షూటింగ్ సెట్‌లో 12 గంటల పాటు ఉండటం వల్ల నటనే కాదు. క్రమశిక్షణ , పని పట్ల అంకితభావం పెరుగుతాయి. కొత్త హీరోయిన్లు సెట్స్‌లో ఎక్కువ సమయం ఉండటం వల్ల సీనియర్ నటుల హావభావాలను గమనించే అవకాశం దక్కుతుంది. ఇది ఒక రకమైన ఆన్-ఫీల్డ్ ట్రైనింగ్ లాంటిది. పని గంటలను కుదించుకుంటే? తమ షాట్ ఉన్నప్పుడు వచ్చి వెళ్లిపోయే ప్రొఫెషనల్స్ గా మిగిలిపోతారే తప్ప సినిమాపై పూర్తి పట్టు సాధించే కళాకారులు గా ఎదగలేరని కంగనా రనౌత్ అభిప్రాయపడింది. పరిశ్రమలో పోటీ పెరిగిన ఈ రోజుల్లో, గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు.
కష్టాన్ని ఇష్టపడే నటీమణులకే నిర్మాతలు, దర్శకులు మొగ్గు చూపుతారు. పని గంటల విషయంలో సైలెంట్‌గా ఉండి పనిని నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లు దీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగుతారు. ఎనిమిది గంటల షిఫ్ట్ అనేది అనుభవం ఉన్నవారికి చెల్లుతుందేమో కానీ పునాదులు వేసుకుంటున్న కొత్త వారికి మాత్రం 12 గంటల శ్రమ ఒక వరమని చెప్పొచ్చు. విజయం అనేది షార్ట్‌కట్లలో రాదు. పని పట్ల చూపే నిబద్ధత, వెచ్చించే సమయమే భవిష్యత్తులో స్టార్‌డమ్‌ను తెచ్చిపెడుతుంది. కొత్తగా వస్తోన్న హీరోయిన్లు పని గంటల లెక్కలు చూడకుండా ప్రతి నిమిషాన్ని విద్యగా మలచుకుంటేనే రేపటి తరం స్టార్‌లుగా వెలుగొందుతారు. శ్రమ అనేది నేర్చుకోవడానికి దొరికే అతిపెద్ద అవకాశం అని కొత్త తరం గుర్తించాలి.
