జెన్నిఫర్ 3రోజుల పేమెంట్‌తో ముంబైలో ఇల్లు కొనొచ్చు
అపర కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 27 Nov 2025 12:00 AM ISTఅపర కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం అంబానీలు ఏకంగా 5000 కోట్లు ఖర్చు చేసారని కథనాలొచ్చాయి. కొన్ని అంతర్జాతీయ పత్రికలు 10,000 కోట్లు ఖర్చయిందని కూడా కొన్ని కథనాలు వెలువరించడం ఆశ్చర్యపరిచింది. సుమారు 6 నెలల పాటు సాగిన సుదీర్ఘ ప్రీవెడ్డింగ్ ఫెస్టివిటీస్, విహార యాత్రల పేరుతో అంబానీలు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేసారు. క్రూయిజ్ షిప్ ప్రయాణంలో విందులో వినోదాలు, జాతీయ అంతర్జాతీయ అతిథులతో వినోదాలు విలాసాలతో ఈ పెళ్లి ఆద్యంతం ధన ప్రవాహానికి ముఖద్వారంగా మారింది.
ఇంటర్నేషనల్ పాప్ స్టార్లలో రిహానాకు ఏకంగా 70కోట్ల పారితోషికం చెల్లించారని, తనతో పాటు వచ్చిన ఇతర పాప్ స్టార్లు, బాలీవుడ్ స్టార్ల కోసం వందల కోట్ల డబ్బును వెదజల్లారని కూడా కథనాలొచ్చాయి. అయితే అంబానీ ల పెళ్లి తరవాత ఆ రేంజు పెళ్లిగా ప్రచారంలో ఉన్న నేత్ర మంతెన- వంశీ గాదిరాజు పెళ్లి కోసం ఎంత ఖర్చయింది? అంటే... ఇది అంబానీల పెళ్లితో పోలిస్తే చాలా చాలా పరిమితం.
కేవలం 300 కోట్లు ఖర్చయిందని చెబుతున్నా, సుమారు 500 కోట్ల వరకూ ఖర్చు తేలి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెళ్లి కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు, అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 70కి పైగా చార్టర్డ్ విమానాలు.. 600 మంది పైగా అతిథులు.. ఇందులో 100 మంది పైగా అంతర్జాతీయ అతిథులు ఈ పెళ్లికి అటెండయ్యారు. రాజస్తాన్ ఉదయ్ పూర్ లో అత్యంత ఖరీదైన ప్యాలెస్ లలో ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. ఇవి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ఒక రాత్రికి ఒక గది కోసం 11లక్షలు చెల్లించారంటే ఖర్చు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవాలి.
ముఖ్యంగా అంతర్జాతీయ పాప్‌స్టార్ జెన్నిఫర్ లోపేజ్ కోసం ఏకంగా 18 కోట్ల పారితోషికాన్ని చెల్లించారని కూడా తెలుస్తోంది. ఈ డబ్బుతో ముంబై ప్రైమ్ ఏరియాలోని అద్భుతమైన సొంత ఇంటిని కొనుగోలు చేయవచ్చు. రణ్ వీర్ సింగ్, షాహిద్ లాంటి స్టార్ల పెర్ఫామెన్సెస్ కోసం 4-5 కోట్ల మధ్యలో చెల్లించారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీ ప్రదర్శనలకు లక్షల్లో చెల్లించుకున్నారు. ఓవరాల్‌గా ఈ పెళ్లి కోసం 400-500 కోట్ల మధ్య ఖర్చయి ఉంటుందని ఒక అంచనాను వెలువరిస్తున్నారు. అయితే అంబానీల రేంజులో ఖర్చు చేయకపోయినా ఈ పెళ్లికి అటెండయిన అంతర్జాతీయ అతిథులు అంబానీలకు తక్కువేమీ కాదు. వంద మంది పైగా దిగ్గజ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు మంతెన- గాదిరాజు పెళ్లికి అటెండయ్యారని చెబుతున్నారు. అయితే ఈ ఖర్చు అంబానీలకు దరిదాపుల్లో లేకపోయినా కానీ, ఈనెల 24వరకూ సాగిన మూడు రోజుల పెళ్లిలో జూనియర్ ట్రంప్ , జెలో సహా అంతర్జాతీయ అతిథులతో ఆ రేంజు ఎలివేషన్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ కోసం అయిన ఖర్చు పై ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అధికారికంగా దీనిని ఎవరూ ప్రకటించలేదు.
