ఒకరి కంటే ఎక్కువమంది భాగస్వాములు.. నటి వ్యాఖ్యలపై దుమారం
నేను ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సన్నిహితంగా ఉంటాను! అంటూ సహానా చేసిన ప్రకటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
By: Sivaji Kontham | 24 Jun 2026 8:00 PM ISTప్రముఖ రచయిత వారసురాలు, బాలీవుడ్ నటి సహానా గోస్వామి ఇటీవల రిలేషన్‌షిప్స్- వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నేను ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సన్నిహితంగా ఉంటాను! అంటూ సహానా చేసిన ప్రకటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే బాంధాలు కేవలం 5 నిమిషాలతో ముగిసేవి కావు.. నేను డీప్ ఎమోషనల్ పర్సన్ ని.. అనుబంధాలు తప్పేమీ కాదు! అని సహానా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజనులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మారుతున్న ఆధునిక కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత సంబంధాల తీరును ఈ వ్యాఖ్యలు మరోసారి ఎత్తిచూపాయి.
ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియా యూజర్ బాలీవుడ్ సెలబ్రిటీల జీవనశైలిని తప్పుబడుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన చాలా మంది సెలబ్రిటీలు స్వేచ్ఛ, ఆధునికత అనే ముసుగులో ఓపెన్ రిలేషన్‌షిప్స్, మల్టిపుల్ పార్ట్‌నర్స్, క్యాజువల్ ఇంటిమసీ వంటి సంస్కృతిని నార్మలైజ్ చేస్తున్నారు! అని ఆరోపించారు. సమాజంలో ఇటువంటి ధోరణులు పెరిగిపోవడానికి సినిమా తారల ప్రవర్తనే కారణమని... అయినా సరే అభిమానులుగా మనం వారిని రోల్ మోడల్స్‌గా ఆరాధిస్తూనే ఉన్నామంటూ సదరు నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదంతో వార్తల్లోకి వచ్చిన సహానా గోస్వామి చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 6 మే 1986న న్యూఢిల్లీలో జన్మించిన సహానా ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త, రచయిత ఓంకార్ గోస్వామి కుమార్తె. పాఠశాల రోజుల్లోనే స్పోర్ట్స్, ఆర్టిఫిషియల్ వాల్ క్లైంబింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో రాణించడమే కాకుండా పద్మశ్రీ కిరణ్ సెగల్ వద్ద దాదాపు 10 సంవత్సరాల పాటు ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పొందారు. చిన్నతనం నుంచే నటనపై ఉన్న ఆసక్తితో ముంబైకి మారిన షహానా.. థియేటర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.
సహానా సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2008లో వచ్చిన `రాక్ ఆన్` చిత్రంలో డెబ్బీ పాత్ర సహానాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటనకుగాను సహానా `ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్` పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత `ఫిరాక్`, `హీరోయిన్`, `మిడ్‌నైట్స్ చిల్డ్రన్`, `బాంబే బేగమ్స్` వంటి చిత్రాలు, సిరీస్‌లతో మెప్పించారు. ఇటీవల కపిల్ శర్మతో కలిసి నటించిన `జ్వీగాటో`,`సంతోష్` చిత్రాలు తనకు అంతర్జాతీయంగా భారీ గుర్తింపు తెచ్చిపెట్టాయి. `సంతోష్` చిత్రంలో నటనకు గాను `ఏషియన్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్` పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు.
నటిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా సహానా గోస్వామి వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ తాజా వ్యాఖ్యలు మాత్రం నెటిజన్లలో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. వెండితెరపై కనిపించే నటీనటులను సమాజం, ముఖ్యంగా యువత ఎక్కువగా ఫాలో అవుతుంటారని.. ఇలాంటి సమయంలో ఓపెన్ రిలేషన్‌షిప్స్... మల్టిపుల్ పార్ట్‌నర్స్ సంస్కృతిని సమర్థించడం భారతీయ సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లవ్, లైఫ్ అండ్ రిలేషన్‌షిప్స్ కల్చర్‌పై నెటిజనుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
