Begin typing your search above and press return to search.

వినోద ప్రపంచంలో అతి పెద్ద డీల్‌ జరగబోతుందా..?

వార్నర్‌ బ్రదర్స్‌ని కొనుగోలు చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే బిడ్‌ రెడీ చేసిందని, అతి త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Ramesh Palla   |   8 Oct 2025 12:02 PM IST
వినోద ప్రపంచంలో అతి పెద్ద డీల్‌ జరగబోతుందా..?
X

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నో ఆన్‌ లైన్ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి అంటే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, ఆపిల్‌ టీవీ ఇలా కొన్నింటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 300 మిలియన్‌లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉన్న నెట్‌ ఫ్లిక్స్‌ టాప్‌ లో ఉంది. ఈ ఓటీటీ పోటీలో నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ పడేందుకు చాలా సంస్థలు ప్రయత్నాలు చేసి కుదేలయ్యాయి. కొన్ని సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌లో విలీనం అయితే, మరికొన్ని సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌ పోటీ భరించలేక మరో ఓటీటీలో విలీనం కాబడిన విషయం తెల్సిందే. ఓటీటీ సంస్థలు విలీనం కావడం అనేది తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఓటీటీ విలీన డీల్‌ జరగబోతుందని హాలీవుడ్‌ వర్గాల నుంచి అంతర్జాతీయ మీడియా సర్కిల్స్ వరకు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

వార్నర్ బ్రదర్స్‌ సినిమాలు

ఒక అంతర్జాతీయ ఎంటర్‌టైన్మెంట్ మీడియా సంస్థ అందించిన కథనం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు గత కొన్నాళ్లుగా అత్యంత పురాతనమైన నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ను కొనుగోలు చేసేందుకు గాను చర్చలు జరుపుతున్నారు. వార్నర్‌ బ్రదర్స్ బ్యానర్‌లో హాలీవుడ్‌ నుంచి వచ్చిన ఎన్నో క్లాసిక్‌ సినిమాలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ కలిగి ఉన్నాయి. అందుకే వార్నర్‌ బ్రదర్స్‌ వద్ద ఉన్న కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ గంపగుత్తగా కొనుగోలు చేయడం కోసం రెడీ అవుతోంది. ప్రస్తుతానికి వార్నర్‌ బ్రదర్స్‌ స్టూడియోస్‌, నిర్మాణ సంస్థలు అంతగా యాక్టివ్‌గా లేవు. గతంతో పోల్చితే వార్నర్ బ్రదర్స్ యొక్క ప్రస్థానం ఆకాశమే హద్దు అన్నట్లుగా లేదు. కనుక నెట్‌ఫ్లిక్స్‌కు తమ కంటెంట్‌ను వార్నర్‌ బ్రదర్స్ ఇచ్చేందుకు ఒకే చెప్పవచ్చు అనే అభిప్రాయం ను చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు...

వార్నర్‌ బ్రదర్స్‌ని కొనుగోలు చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే బిడ్‌ రెడీ చేసిందని, అతి త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్‌ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలకు సంబంధించిన క్యారెక్టర్స్‌ను, సినిమాలను, సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్ వినియోగించుకునే విధంగా ఒప్పందం జరిపే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అత్యంత భారీ డీల్‌ కు అంతా రెడీ అవుతోంది. ఈ డీల్‌ మొత్తం ఎంత అనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఇప్పటి వరకు ఏ ఒటీటీ సంస్థ ఇవ్వని భారీ బిడ్‌ ను నెట్‌ఫ్లిక్స్‌ నుంచి వార్నర్‌ బ్రదర్స్‌ కు అందే అవకాశాలు ఉన్నాయి అంటూ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు. ఇదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.

వార్నర్‌ బ్రదర్స్‌ కంటెంట్‌ నెట్‌ఫ్లిక్స్‌లో...

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆధరణ ఉన్న నెట్‌ఫ్లిక్స్ తమ కంటెంట్‌ క్వాలిటీ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. వార్నర్‌ బ్రదర్స్‌ తో డీల్‌ కుదిరితే, విలీనం పక్రియా అంతా సాఫీగా సాగితే ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్ లో కంటెంట్‌ ఇతర ఓటీటీ కంటెంట్‌తో పోల్చితే టాప్‌ రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. వార్నర్‌ బ్రదర్స్‌ను కొనుగోలు చేసేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ వద్ద అంత ఆర్థిక స్థోమత లేకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే ఆర్థిక వనరులు సమకూర్చుకుందని, పెట్టుబడి పెట్టేందుకు బయట నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నెట్‌ఫ్లిక్స్ వంటి అతి పెద్ద ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ వారు వార్నర్‌ బ్రదర్స్ కంటెంట్‌ తీసుకుంటే ప్రేక్షకులకు ఖచ్చితంగా మంచి వినోదాల విందు దక్కడం ఖాయం.