Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ 'థియేటర్' ప్లాన్.. నిజమేనా? పాజిబుల్ అవుతుందా?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు పొందిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

By:  M Prashanth   |   7 April 2026 8:00 AM IST
నెట్ ఫ్లిక్స్ థియేటర్ ప్లాన్.. నిజమేనా? పాజిబుల్ అవుతుందా?
X

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు పొందిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రంగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, నెట్‌ ఫ్లిక్స్ చిన్న టౌన్స్ ను లక్ష్యంగా చేసుకుని కొత్త థియేటర్ల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద నగరాలకు పరిమితమైన మల్టీప్లెక్స్ అనుభవాన్ని చిన్న పట్టణాలకు కూడా తీసుకెళ్లాలన్నది ప్లాన్ లో భాగమని తెలుస్తోంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినోద సౌకర్యాల్లో ఉన్న తేడాను తగ్గించవచ్చని చెప్పాలి.

ఇక థియేటర్లలో కేవలం ఇతర సినిమాల ప్రదర్శన మాత్రమే కాకుండా, నెట్‌ ఫ్లిక్స్ రూపొందించే ఒరిజినల్ కంటెంట్‌ ను కూడా పెద్ద తెరపై చూపించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఓటీటీకి మాత్రమే పరిమితమైన కంటెంట్‌ ను థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా కొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఆలోచన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా, సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగుపెట్టాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా నిర్మాణం నుంచి విడుదల, ప్రదర్శన వరకు మొత్తం వ్యవస్థను ఒకే సంస్థ ఆధీనంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందుతున్నాయని సమాచారం. ఇలా చేస్తే ఖర్చులు తగ్గడంతో పాటు కంటెంట్‌ పై పూర్తి నియంత్రణ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆ ప్రతిపాదనపై కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకే సంస్థ నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అన్నీ నిర్వహిస్తే, ఇతర నిర్మాతలు, థియేటర్ యజమానులపై ప్రభావం పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే చిన్న నిర్మాతలకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, ప్రణాళిక అమలు అయితే ప్రేక్షకులకు మాత్రం కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉన్న సినీ అభిమానులకు మెరుగైన థియేటర్ సౌకర్యాలు లభించవచ్చని చెబుతున్నారు. అలాగే ఓటీటీ, థియేటర్ మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, నెట్‌ ఫ్లిక్స్ థియేటర్ రంగంలోకి వస్తుందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. కానీ ఆ ప్రణాళిక వాస్తవంగా అమల్లోకి వస్తుందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అంతే కాదు.. పాజిబుల్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ వార్తలను ఊహాగానాలుగానే పరిగణించాలేమో.