Begin typing your search above and press return to search.

1-గంట నిడివి సినిమా.. OTT పోటీలో యువ‌ద‌ర్శ‌కుల‌కు ఛాన్సులే ఛాన్సులు!

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ప్రేక్షకులకు తక్కువ సమయంలో పూర్తి వినోదాన్ని అందించేందుకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

By:  Sivaji Kontham   |   25 Sept 2026 9:47 AM IST
1-గంట నిడివి సినిమా.. OTT పోటీలో యువ‌ద‌ర్శ‌కుల‌కు ఛాన్సులే ఛాన్సులు!
X

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ప్రేక్షకులకు తక్కువ సమయంలో పూర్తి వినోదాన్ని అందించేందుకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఉండే 2 నుంచి 3 గంటల సుదీర్ఘ సినిమాలకు బదులుగా కేవలం 60 నుండి 85 నిమిషాల నిడివి ఉండే కాంపాక్ట్ ఫీచర్ ఫిలిమ్స్‌ను తెరకెక్కించే ప్రణాళికపై దృష్టి సారించింది. లంచ్ బ్రేక్ సమయంలో లేదా పనుల మధ్యలో చిన్న విరామం దొరికినప్పుడు పూర్తి సినిమా చూసే అనుభూతిని పొందాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకువస్తున్నారు.

ఈ సరికొత్త విధానాన్ని నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి ప్రత్యేక కేటగిరీగా అధికారికంగా ప్రకటించ‌క‌పోయినా.. ఇది వారి భ‌విష్య‌త్ వృద్ధి వ్యూహంలో భాగమని తెలుస్తోంది. సాంప్రదాయ మూడు గంటల చిత్రాలలో చూపించలేని సరికొత్త కథలు.. ప్రయోగాత్మక జోనర్స్.. యువతరంలో సృజనాత్మక ప్రతిభావంతులతో కలిసి పనిచేసేందుకు ఈ చిన్న నిడివి సినిమాలు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా టైట్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామాలు, హై-కాన్సెప్ట్ కామెడీల వంటి జోనర్‌లు చిన్న రన్‌టైమ్‌లో మరింత ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ ప్రయోగంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా గత ఏడాది విడుదల చేసిన `గ్రేటర్ కలేష్` అనే 52 నిమిషాల కామెడీ డ్రామా చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అహసాస్ చన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే గ్లోబల్ టాప్-10 నాన్-ఇంగ్లీష్ టైటిల్స్‌లో చోటు సంపాదించుకుని 1.7 మిలియన్ల వ్యూయింగ్ అవర్స్‌ను రాబట్టింది. ఈ విజయం ఇచ్చిన నమ్మకంతోనే నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి కాంపాక్ట్ కథాంశాలపై మరింత దృష్టి పెట్టేందుకు బలమైన పునాది పడింది.

ప్రస్తుతం ఈ విభాగంలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నట్లు సమాచారం. `ఎన్‌హెచ్‌10` ఫేం నవ్‌దీప్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా.. మరో సినిమాను ప్రముఖ నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ (యెల్లో కలర్ ప్రొడక్షన్స్) నిర్మిస్తున్నారు. గత ఏడాది ట్రెండ్ సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ `బ్లాక్, వైట్ & గ్రే: లవ్ కిల్స్` దర్శకుడు పుష్కర్ మహాబల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే `90-మినిట్ ఫిలిం` అనే కేటగిరీ ఉన్నా కేవలం వ్యూవర్స్ కోసం పాత సినిమాలను అందులో ఉంచుతున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాత్రం మొదటిసారిగా స్క్రిప్ట్ దశ నుంచే కేవలం 90 నిమిషాల లోపు నిడివితో ఒరిజినల్ సినిమాలను నిర్మించడం విశేషం. తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తయ్యే ఈ చిత్రాలు, ఓటీటీ కంటెంట్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలక‌నుందా? అన్న‌ది చూడాలి. అయితే నెట్ ఫ్లిక్స్ ఫార్ములాతోనే ఇత‌ర ఓటీటీ దిగ్గ‌జాలు దీనిని ఫాలో అయ్యేందుకు ఆస్కారం ఉంద‌ని ఒక అంచ‌నా. గంట నిడివి సినిమా.. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్కించే ప్ర‌తిభావంతులైన యువ‌ద‌ర్శ‌కుల‌కు ఇది వ‌రంగా మారే ఛాన్సుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.