నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ: డైనోసార్ల ప్రపంచంలో కూడా రాజకీయాలా?
డైనోసార్స్ గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ ఫ్రాంఛైజీలు మొదలు డైనోసార్ ప్రపంచం గురించి ప్రజలకు చాలా అవగాహన ఉంది.
By: Sivaji Kontham | 17 April 2026 4:00 AM ISTడైనోసార్స్ గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ ఫ్రాంఛైజీలు మొదలు డైనోసార్ ప్రపంచం గురించి ప్రజలకు చాలా అవగాహన ఉంది. ఫ్యామిలీ ఆడియెన్, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ మెచ్చే జానర్ సినిమాలు డైనోసార్ కథలతో ఎన్నో వచ్చేసాయి.
అయితే నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన `ది డైనోసార్స్` డాక్యుమెంటరీ సిరీస్ డైనోసార్ల ప్రపంచాన్ని పాత కథతోనే కొత్త కోణంలో ఆవిష్కరించింది. అయితే ఇది కేవలం వైజ్ఞానిక విషయాలకే పరిమితం కాకుండా.. మానవ చరిత్రలోని సామ్రాజ్యవాద ఆక్రమణలను తలపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో శక్తివంతమైన రాజ్యాలు బలహీనమైన దేశాలను ఎలా ఆక్రమించుకున్నాయో.. అదే రీతిలో డైనోసార్లు ఇతర జాతులపై ఆధిపత్యం చెలాయించినట్లు ఈ సిరీస్‌లో చూపించారు. ఒక జాతి పురోగతి సాధించాలంటే మరొకటి నాశనం కావాలనే `విన్-లాస్` సిద్ధాంతం చుట్టూ ఈ కథనం సాగడం గమనార్హం.
ఈ డాక్యుమెంటరీలో డైనోసార్ల పరిణామ క్రమాన్ని కేవలం ఒక జీవశాస్త్ర ప్రక్రియగా కాకుండా.. ఒక `విజయగాథ`గా మలిచారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఇవి విస్తరించడాన్ని, ఒక సైన్యం సరిహద్దులు దాటి దేశాలను ఆక్రమించినట్లుగా చిత్రించడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ మార్పులకు అనుగుణంగా ఇవి ఎలా మనుగడ సాగించాయనే దానికంటే.. తమ అధికారాన్ని ఎలా నిలబెట్టుకున్నాయనే అంశంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి సారించారు.
వైజ్ఞానిక వాస్తవాల కంటే నాటకీయతకు.. సాహస గాథలకు ఈ సిరీస్‌లో పెద్దపీట వేశారు. సాధారణంగా ప్రకృతిలో మనుగడ అనేది జీవుల మధ్య సహకారంపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కథనం కేవలం సంఘర్షణను, శత్రుత్వాన్ని మాత్రమే హైలైట్ చేసింది. ముఖ్యంగా క్షీరదాలు.. డైనోసార్ల మధ్య ఉన్న సంబంధాన్ని భౌగోళిక రాజకీయాల తరహాలో పోరాటంగా చూపడం విమర్శలకు తావిస్తోంది. అద్భుతమైన విజువల్స్ ఉన్నా.. లోతైన వైజ్ఞానిక చర్చ లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మానవ చరిత్రలో జరిగిన వలసవాద ప్రభావాలు ఈ డైనోసార్ల కథనంలో అద్దం పడుతున్నాయి. దశాబ్దాలుగా ఉన్న ``డైనోసార్లే సర్వశక్తిమంతులు`` అనే పాత భావజాలాన్నే ఈ సిరీస్ మళ్ళీ ప్రచారం చేస్తోంది. ప్రకృతి గురించి ప్రజల్లో ఉన్న అవగాహనను కేవలం యుద్ధం లేదా ఆక్రమణ అనే ఒకే కోణానికి పరిమితం చేసే ప్రమాదం ఇక్కడ కనిపిస్తుంది. పురాతన జీవశాస్త్రం రంగంలో వెలుగులోకి వచ్చిన సరికొత్త పరిశోధనలను విస్మరించి.. పాత మూస పద్ధతిలోనే కథను వివరించడం గమనార్హం.
సైన్స్ డాక్యుమెంటరీలు కేవలం వాస్తవాలను చెప్పడమే కాకుండా... అవి ప్రదర్శించే సామాజిక దృక్పథంపై కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. డైనోసార్ల అంతం లేదా మనుగడ అనేది ప్రకృతి సహజ సిద్ధంగా జరిగిన ప్రక్రియే తప్ప అది ఒక సామ్రాజ్యం కూలిపోవడం వంటి రాజకీయ పరిణామం కాదు. వినోదం కోసం విజ్ఞానానికి వలసవాద రంగులు అద్దడం వల్ల సైన్స్‌ను అర్థం చేసుకునే మూల సూత్రాలే దెబ్బతినే అవకాశం ఉందనే విశ్లేషణలు ఈ డాక్యు సిరీస్ పై వెలువడుతున్నాయి.
