Begin typing your search above and press return to search.

AI తో నెట్ ఫ్లిక్స్ మరో వినూత్న ప్రయత్నం!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం ప్రతి ఒక్కరికి మరింత సులభంగా మారిపోయింది.

By:  Madhu Reddy   |   23 Jan 2026 11:23 AM IST
AI తో నెట్ ఫ్లిక్స్ మరో వినూత్న ప్రయత్నం!
X

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం ప్రతి ఒక్కరికి మరింత సులభంగా మారిపోయింది. సరైన సమాచారం అందించడంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ కష్టపడకుండా ఈ ఏఐ పై ఆధారపడుతున్నారు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా టాప్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ కూడా ఇప్పుడు ఏఐని ఉపయోగిస్తూ సంచలనాలకు తెరలేపింది.

సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయంలో పూర్తిస్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధార పడబోతోంది. అంతేకాదు ఇప్పుడు సబ్ టైటిల్స్ విషయంలో కూడా ఏఐని ఉపయోగించనున్నట్లు స్పష్టం చేసింది.అసలు విషయంలోకి వెళ్తే.. పెద్దగా ఖర్చు లేకుండా మెరుగైన సన్నివేశాలను తెరకెక్కించడానికి ఏఐని ఉపయోగించనున్నట్లు ఇదివరకే నెట్ ఫ్లిక్స్ తెలిపింది. అందులో భాగంగా అర్జెంటీనాకు చెందిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'ది ఎటర్నౌట్' లో ఈ దిశగా ఒక ప్రయోగం చేసింది నెట్ ఫ్లిక్స్. అయితే ఇది కాస్త గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.

పైగా ది ఎటర్నౌట్ సిరీస్ లో తొలిసారిగా జనరేటివ్ ఏఐని ఉపయోగించినట్లు నెట్ ఫ్లిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెడ్ సరాండోస్ కూడా తెలిపారు.ఇకపోతే సినిమాలు, వెబ్ సిరీస్ లను మరింత మెరుగ్గా రూపొందించడానికి ఏఐ ఒక గొప్ప అవకాశం అని వ్యాఖ్యానించారు. ఇది ఖర్చులను కూడా తగ్గిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ లేదా సినిమాలతో పోల్చుకుంటే ఏఐ ద్వారా రూపొందించిన మొట్టమొదటి ఫైనల్ ఫుటేజ్ సిరీస్ ఇదేనని, ఏఐ టూల్స్ ని ఉపయోగించి అద్భుతమైన ఫలితాన్ని పొందామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ రంగంలో మరింత వినూత్నమైన ప్రయత్నాలు చేస్తామని గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

అందులో భాగంగానే ఇకపై నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లో ఉపయోగించే సబ్ టైటిల్స్ కి కూడా ఏఐని వినియోగించనున్నారుట. ప్రపంచ స్థాయిలో ఉన్న దాదాపు అన్ని భాషలకు సంబంధించిన సబ్ టైటిల్స్ ను ప్రేక్షకులకు.. వారి ప్రాంతీయ భాషలలో అందించడం కోసమే ఈ ఏఐని ఉపయోగించబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు సృజనాత్మక బృందాలు, కంటెంట్ ప్రమోషన్ తో పాటు యాడ్స్ కోసం ఏఐ ఎలా మద్దతు ఇస్తుందో కూడా నెట్ ఫ్లిక్స్ వివరించింది. ఈ విధానం అంతర్జాతీయ మార్కెట్లో మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది అని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది.

ప్రస్తుతం ఏఐ సాధనాలను మరింత అభివృద్ధి చేస్తూ.. ఇకపై సబ్ టైటిల్స్ విషయంలో కూడా మరింత అభివృద్ధి జరుగుతోందని.. త్వరలోనే ఎంపిక చేసిన భాషలలో ఏఐ డబ్బింగ్ ను పరీక్షించడం ప్రారంభిస్తామని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ఇక కాలక్రమేనా ఈ ప్రక్రియను మెరుగుపరచడానికి అలాగే జనరేటివ్ స్పీచ్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని.. అందుకుగాను సాంకేతిక నిపుణులను నియమిస్తున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని, విజువల్ ను అందించడమే కాకుండా ఖర్చును తగ్గించుకొని.. లాభాల దిశగా అడుగులు వేయడానికి ఏ ఐ ను సమర్థవంతంగా నెట్ ఫ్లిక్స్ ఉపయోగించుకోబోతోంది అంటూ ఓటీటీ ప్రియులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ఏఐ రంగంలో సబ్ టైటిల్స్ ను సమర్థవంతంగా ప్రదర్శించగలిగితే.. ఏ ఐ ను చక్కగా ఉపయోగించుకుంటూ ఏఐ సహాయంతో సబ్ టైటిల్స్ ని కూడా రూపొందించిన మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ఫారం గా నెట్ ఫ్లిక్స్ రికార్డు సృష్టించనుంది.