ఇది హిట్ అయితే సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ ఛాన్స్..!
ఆ మధ్య లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్‌ల కాంబోలో భారీ మల్టీస్టారర్ మూవీ అనుకున్నారు.
By: Ramesh Palla | 10 Oct 2026 11:31 AM ISTగతంతో పోల్చితే దర్శకులు ఇప్పుడు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్లుగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే వెసులుబాటు ఉంటుంది, కానీ దర్శకులు ఒకే సినిమాను చేయాల్సి ఉంటుంది. గతంలో దర్శకులు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయట. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు, పెరిగిన బడ్జెట్ కారణంగా దర్శకులు ఒక సినిమాను పూర్తి చేసి, విడుదల చేసిన తర్వాతే మరో సినిమాను మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిర్మాతలతో ముందస్తుగా ఒప్పందం కూడా అదే ఉంటుంది. ఒక సినిమా చేసే సమయంలో తదుపరి సినిమాకు కమిట్ కావడం, కాంబినేషన్ సెట్ చేయడం దర్శకులు చేస్తూ ఉంటారు. అయితే చేసే సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ దక్కించుకుంటే తదుపరి సినిమా చర్చలు అర్థాంతరంగా ఆగి పోవడంతో పాటు, మొత్తం ప్రాజెక్ట్ క్యాన్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్...
ఆ మధ్య లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్‌ల కాంబోలో భారీ మల్టీస్టారర్ మూవీ అనుకున్నారు. కానీ రజనీకాంత్‌తో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. గౌరవ ప్రధమైన వసూళ్లు వచ్చినప్పటికీ అభిమానులు ఆశించిన కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా మాత్రం కూలీ నిలవలేక పోయింది. దాంతో పాటు లోకేష్ కగనరాజ్ మేకింగ్ పైనా విమర్శలు వచ్చాయి. గతంలో వచ్చిన విక్రమ్ ఇతర సినిమాల మాదిరిగా కూలీ సినిమాను తీయలేకపోయాడు అంటూ కొందరు విమర్శలు చేశారు. దాంతో రజనీకాంత్, కమల్ హాసన్‌ల కాంబో మల్టీ స్టారర్ సినిమా నుంచి లోకేష్ కనగరాజ్‌ను తప్పించారు అనే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా కూలీ సినిమా ఫలితం కారణంగా అమీర్ ఖాన్‌తో అనుకున్న ప్రాజెక్ట్ ను సైతం లోకేష్ కనగరాజ్ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితిని దర్శకుడు నెల్సన్ దిలీప్ ఎదుర్కోబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జైలర్ 2 సినిమాతో నెల్సన్ దిలీప్...
రజనీకాంత్ 'కూలీ' సినిమా తర్వాత చేస్తున్న మూవీ జైలర్ 2. భారీ అంచనాల నడుమ జైలర్ సినిమాకు సీక్వెల్‌గా జైలర్ 2 రూపొందిన విషయం తెల్సిందే. జైలర్ సినిమాను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ ఈ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది జైలర్ 2 పై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్‌తో అంచనాలు పెరిగాయి. పలువురు సూపర్ స్టార్స్, ఎంతో మంది స్టార్ నటీనటులు జైలర్ 2 లో ఉన్నారు. దాంతో సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని ఆశ పడుతున్నారు. మొత్తానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో సఫలం అయ్యాడు అనుకోవచ్చు. జైలర్ సూపర్ హిట్ కావడంతో పాటు ఆయన ఇతర ప్రాజెక్ట్‌లు మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ ను తప్పించిన ప్రాజెక్ట్ బాధ్యతలు నెల్సన్ దిలీప్‌కు ఇవ్వడం జరిగింది.
రజనీకాంత్, కమల్ హాసన్‌ల మల్టీస్టారర్...
కమల్ హాసన్, రజనీకాంత్‌లను డైరెక్ట్ చేసే అవకాశం ఈ దర్శకుడికి వచ్చినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ భారీ మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే జైలర్ 2 సినిమా సూపర్ హిట్ అయితేనే ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అనే అభిప్రాయం తమిళ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎలా అయితే కూలీ ఫ్లాప్ కావడంతో లోకేష్ కనగరాజ్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారో అలాగే జైలర్ 2 హిట్ కాకుంటే తప్పకుండా కమల్, రజనీకాంత్ మల్టీస్టారర్ నుంచి నెల్సన్ దిలీప్ ను తప్పించే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. అందుకే జైలర్ 2 హిట్ అయితేనే దర్శకుడు నెల్సన్ దిలీప్ కి ఇద్దరు బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోల మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం దక్కుతుంది. కనుక ఇప్పుడు ఆయనకు జైలర్ 2 హిట్ అనేది అత్యంత కీలకంగా మారింది. అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జైలర్ 2 సినిమాను తెలుగులో సితార వాళ్లు డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.
