Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్- మార్ఫింగ్: నేహా శ‌ర్మ కంటే ముందే వార్నింగ్ ఇచ్చిన టాప్-5 హీరోయిన్లు!

అనుమతి లేకుండా ఇతరుల ముఖాలను లేదా రూపాన్ని ఏఐ ద్వారా ఉపయోగించి కంటెంట్‌ను సృష్టించడం చట్టవిరుద్ధమని .. ఇది వ్యక్తిత్వ హక్కుల తీవ్ర ఉల్లంఘన కిందకు వస్తుందని నేహా శర్మ పేర్కొన్నారు.

By:  Sivaji Kontham   |   18 Oct 2026 11:22 AM IST
డీప్ ఫేక్- మార్ఫింగ్: నేహా శ‌ర్మ కంటే ముందే వార్నింగ్ ఇచ్చిన టాప్-5 హీరోయిన్లు!
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా ఎదుగుతున్నా.. దాని దుర్వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో తన అనుమతి లేకుండా ఏఐ ద్వారా తయారు చేసిన డిజిటల్ ఇమేజ్‌లు, వీడియోలు వైర‌ల్ అవుతుండటంపై ప్రముఖ బాలీవుడ్ నటి నేహా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భద్రత, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న ఈ కంటెంట్‌ను ఏమాత్రం ఉపేక్షించబోనని స్పష్టం చేస్తూ.. సంబంధిత పేజీలు- ఖాతాలు వాటిని వెంటనే డిలీట్ చేయాలని గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఆ కంటెంట్‌ను తొలగించకపోతే బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు.

అనుమతి లేకుండా ఇతరుల ముఖాలను లేదా రూపాన్ని ఏఐ ద్వారా ఉపయోగించి కంటెంట్‌ను సృష్టించడం చట్టవిరుద్ధమని .. ఇది వ్యక్తిత్వ హక్కుల తీవ్ర ఉల్లంఘన కిందకు వస్తుందని నేహా శర్మ పేర్కొన్నారు. ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు సంబంధించిన డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సైబర్ బెదిరింపులకు అద్దం పడుతోంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లుతుండటంతో సెలబ్రిటీలు తమ డిజిటల్ భద్రత కోసం గళం విప్పుతున్నారు. సినీ తారల వ్యక్తిగత భద్రత - హక్కుల రక్షణ కోసం ఏఐ కంటెంట్‌పై కఠినమైన నిబంధనలు, చట్టపరమైన చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఈ తరహా ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్స్, అక్రమ వాణిజ్య వినియోగం నుండి తమ పేరు, ముఖం, గొంతు, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి భారతీయ సినీ ప్రముఖులు చట్టపరమైన రక్షణను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున‌, ఎన్టీఆర్ వంటి అగ్ర నటుల బాటలోనే పలువురు స్టార్ నటీమణులు తమ పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించి లేదా ట్రేడ్‌మార్క్ రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఆలియా భట్ తన పేరు, రూపం, డిజిటల్ ఇమేజ్‌లను ఫేక్ వీడియోలు లేదా ప్రకటనల్లో అనుమతి లేకుండా వాడకుండా ఢిల్లీ హైకోర్టు ద్వారా స్పష్టమైన ఇంజంక్షన్ ఉత్తర్వులు సాధించారు.

అలాగే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా జోనాస్ గ్లోబల్ బ్రాండ్‌లు, ఏఐ ప్రాక్సీ ఇమేజ్‌ల ద్వారా సాగే అక్రమ ప్రకటనల నుండి తన వాయిస్, ఇమేజ్ రక్షణకు లీగల్ టీమ్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టారు. గ్లోబల్ ఐకాన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా తన పేరు, రూపం, ఆడియో ఆధారిత ఏఐ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడటాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి కీలకమైన కోర్టు ఉత్తర్వులను పొందారు. ఈ తరహా చట్టపరమైన రక్షణ బాలీవుడ్‌లో సెలబ్రిటీల డిజిటల్ హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

మరోవైపు ప్రముఖ నటీమణులు దీపికా పదుకోన్, కత్రినా కైఫ్‌లు సైతం తమ బ్రాండ్ వాల్యూ , డిజిటల్ గుర్తింపును కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీపికా పదుకోన్ తన పేరు, పోలికలను చట్టవిరుద్ధమైన ప్రకటనలు, డీప్‌ఫేక్స్, ఆన్‌లైన్ మోసాలకు ఉపయోగించకుండా పర్సనాలిటీ రైట్స్ పరిధిలోకి తెచ్చుకోవడానికి దరఖాస్తు చేసుకోగా.. కత్రినా కైఫ్ తన పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో తన రూపాన్ని వాడటంపై లీగల్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికి ఏఐ సృష్టిస్తున్న సైబర్ సవాళ్లను ఎదుర్కొంటూ తమ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించుకోవడంలో సినీ ప్రముఖుల చట్టపరమైన పోరాటం విస్తృత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ కొంత కాలంగా కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డినా సోష‌ల్ మీడియాలో స్పీడ్ గా ఉన్నారు. తన‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు అంత‌ర్జాలంలో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ప‌ర్య‌వ‌సానంపై సీరియ‌స్ గా స్పందిస్తూ ఇప్పుడిలా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం హాట్ టాపిగ్గా మారింది.