Begin typing your search above and press return to search.

సెలబ్రిటీలకూ ప్రైవసీ ఉంటుంది.. పాపరాజీలకు నేహా ధూపియా స్ట్రాంగ్ వార్నింగ్!

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా బాలీవుడ్ నటి నేహా ధూపియా పాపరాజీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 July 2026 5:26 PM IST
సెలబ్రిటీలకూ ప్రైవసీ ఉంటుంది.. పాపరాజీలకు నేహా ధూపియా స్ట్రాంగ్ వార్నింగ్!
X

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా బాలీవుడ్ నటి నేహా ధూపియా పాపరాజీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళా సెలబ్రిటీలను కావాల‌ని బ్యాక్ షాట్స్(వెనుక నుంచి ఫోటోలు) తీస్తున్న కొందరు ఫోటోగ్రాఫర్లను ఆమె బహిరంగంగానే ప్రశ్నిస్తూ, వెంటనే అలాంటి ఫోటోలు తీయడం నిలిపివేయాలని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవం, ప్రైవసీ హక్కులపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఈవెంట్‌లో ఫోటోలు దిగుతున్న సమయంలో నేహా ధూపియా ఒక్కసారిగా ఆగి, ఇలా బ్యాక్ షాట్లు ఎవరు తీస్తున్నారు? వెంటనే ఆపండి. ఇది చాలా అసభ్యకరమైన ప్రవర్తన అంటూ పాపరాజీలను నిలదీశారు. అంతేకాకుండా, త‌న‌కు మాత్రమే కాద‌ని, ఎవరికీ ఇలా చేయకండి అంటూ ఎన్నిసార్లు చెప్పినా ఇదే పద్ధతి కొనసాగుతోందని, సెల‌బ్రిటీలంతా ఫోటోగ్రాఫ‌ర్ల‌తో ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నామ‌ని, అదే గౌరవాన్ని మీరు కూడా చూపించాలంటూ నేహా స్పష్టంగా చెప్పారు.

నేహా కామెంట్స్ కేవలం తన వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేయలేదు. మహిళా సెలబ్రిటీలను కొన్ని స్పెష‌ల్ యాంగిల్స్ లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, వైరల్ కంటెంట్ కోసం ప్రయత్నించే ధోరణిని ఆమె ప్రశ్నించారు. చాలామంది నెటిజన్లు కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ, సెలబ్రిటీ అయినంత మాత్రాన వారి ప‌ర్స‌న‌ల్ లిమిట్స్ ను దాటే హక్కు ఎవరికీ లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో పాపరాజీల ప్రవర్తనపై సోనాక్షి సిన్హా కూడా తన అత్తింటి కుటుంబ సభ్యులను కారులో ఉండగానే ఫోటోలు తీసిన మీడియా ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఏడాది మే నెలలో ఆసుపత్రి సందర్శన సందర్భంగా సల్మాన్ ఖాన్ కూడా ఫోటోగ్రాఫర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, అనంతరం మీడియా క్షమాపణలు చెప్పిన ఘటన జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, తాను ఎప్పుడూ మీడియాకు గౌరవం ఇచ్చానని, కానీ ఎవరి బాధనైనా కంటెంట్‌గా మార్చే ప్రయత్నాలు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ కూడా సెలబ్రిటీల ప్రైవసీపై జరుగుతున్న చర్చకు మరింత బ‌లాన్ని చేకూర్చాయి.

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ప్రతి కదలిక వార్తగా మారుతున్నప్పటికీ, వారికి కూడా వ్యక్తిగత గౌరవం, భద్రత, ప్రైవసీ హక్కులుంటాయని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. వార్తలను సేకరించే క్రమంలో మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో వ్యక్తిగత హద్దులను గౌరవించడం కూడా అంతే అవసరమనే సందేశాన్ని నేహా ధూపియా ఆగ్రహం స్పష్టంగా తెలియజేసింది. సెలబ్రిటీలను వార్తల కోసం వెంబడించడం ఒక వృత్తి అయినప్పటికీ, అది మర్యాద, బాధ్యత, నైతిక విలువల పరిధిలోనే ఉండాలనే డిస్క‌ష‌న్ ఇప్పుడు నెట్టింట మరింత బలంగా వినిపిస్తోంది.