పదేళ్లుగా నవ్వడం మర్చిపోయానన్న NBK బ్యూటీ!
ఈ సినిమాలో యాక్షన్ క్వీన్ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ నేహా ధూపియా.
By: Sivaji Kontham | 30 May 2026 7:00 PM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకరత్న డా. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం `పరమవీరచక్ర`. ఈ సినిమాలో యాక్షన్ క్వీన్ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ నేహా ధూపియా. అంతకుముందు హిందీలో `జూలీ` వంటి చిత్రాలలో అత్యంత రొమాంటిక్ పాత్రలతో మెప్పించిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగానూ ఘాటుగా అందాల ఆరబోతతో కెరీర్ ఆరంభంలో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత సహనటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యాక సినిమాలను కాస్త తగ్గించిన నేహా ధూపియా.. తాజాగా తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన వృత్తిపరమైన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన ఒక సంఘటన గురించి నేహా ధూపియా ఇటీవల ప్రముఖ నటి హుమా ఖురేషీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా మాట్లాడింది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఒక ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ తనను ఉద్దేశించి చేసిన కామెంట్ తన మనసుపై ఎంతటి బలమైన ముద్ర వేసిందో గుర్తుచేసుకుంది. ఆడిషన్స్ ఇచ్చే సమయంలో సదరు కాస్టింగ్ డైరెక్టర్ తన దగ్గరకు వచ్చి.. ``నువ్వు ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు అస్సలు నవ్వకు... నీ నవ్వు చాలా బిగ్గరగా ఉంటుంది`` అని నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేశాడని నేహా ధూపియా అసలు నిజాన్ని బయటపెట్టింది.
ఆ కాస్టింగ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్య ఇతరులకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ.. ఒక నటిగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న తనకు మాత్రం అది చాలా మానసిక వేదనను మిగిల్చిందని నేహా అంగీకరించింది. ఆ చిన్న విమర్శ తన వృత్తిపరమైన ప్రవర్తనను.. తనను తాను చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన రూపంపై తన నవ్వుపై తనకే అనుమానం వచ్చేలా ఆ మాటలు వేధించాయని.. ఆ ఒక్క వ్యాఖ్య తన మనసులో నూతన నటీనటుల్లో ఉండే ఒక రకమైన ఆత్మన్యూనతా భావాన్ని,సెల్ఫ్ డౌట్ ని బలంగా నాటేసిందని నేహా ధూపియా పేర్కొంది.
ఈ విమర్శ ప్రభావం వల్ల తాను దాదాపు పదేళ్ల పాటు నవ్వడమే మర్చిపోయానని నేహా ధూపియా అత్యంత విచారకరమైన నిజాన్ని వెల్లడించింది. నా నవ్వులో ఏదో లోపం ఉందనే బలమైన భ్రమలో నేను ఉండిపోయాను. అందుకే దాదాపు పదేళ్ల పాటు జరిగిన ఆడిషన్లలో గానీ లేదా కెమెరాలకు ఫోజులు ఇచ్చేటప్పుడు గానీ అస్సలు నవ్వేదాన్ని కాదు! అని నేహా స్పష్టం చేసింది. ఒక అపరిచిత వ్యక్తి చేసిన ప్రతికూల వ్యాఖ్య.. ఒక నటి అంతర్గత సృజనాత్మకతను.. సహజమైన అందాన్ని పదేళ్ల పాటు ఎలా బంధించి ఉంచగలదో చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని ధూపియా వివరించింది.
గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే ఇలాంటి బాడీ షేమింగ్.. రూపంపై విమర్శలు చాలామంది నటీనటుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. నేహా ధూపియా లాంటి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి కూడా ఇటువంటి కామెంట్ల వల్ల పదేళ్ల పాటు తన సహజమైన నవ్వును దాచుకోవాల్సి రావడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. అయితే ఆ బంధనాల నుంచి బయటపడి ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో.. ఆత్మవిశ్వాసంతో లైఫ్‌ను లీడ్ చేస్తూ నేటి తరం నటీనటులకు నేహా ఒక ఆదర్శంగా నిలుస్తోంది.
