స్టూడెంట్స్ పోరాటం నుంచి సినిమాకి.. నీట్ లీక్ కథ సిల్వర్ స్క్రీన్‌పై!
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం, దానిపై విద్యార్థులు జరిపిన పోరాటం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది.
By: Madhu Reddy | 30 July 2026 11:36 PM ISTదేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం, దానిపై విద్యార్థులు జరిపిన పోరాటం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నెల రోజులకు పైగా జరిగిన ఆందోళనలు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగాయి. విద్యార్థుల ఉపాధి, భవిష్యత్తు కోసం సాగిన ఈ చరిత్రాత్మక ఉద్యమం ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూపకల్పన చేశారు.
దేశాన్ని ఊపేసిన నీట్ లీక్ ఉద్యమం:
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, వర్షాకాల సమావేశాల వేళ విద్యార్థులు చేపట్టిన 'చలో సంసద్' ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇక విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి విద్యాశాఖ మంత్రిని మార్చి ప్రహ్లాద్ జోషీని నియమించింది.
బాలీవుడ్‌లో సినిమాగా రూపుదిద్దుకుంటున్న కథ:
సోషల్ మీడియా, వీధుల్లో మార్మోగిన ఈ విద్యార్థి పోరాటాన్ని ఇప్పుడు వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను జైపూర్‌కు చెందిన ప్రొడ్యూసర్ గోవింద్ దేవ్ అధికారికంగా ప్రకటించారు. నీట్ లీకేజీ వెనుక ఉన్న కుట్రలు, విద్యార్థులు ఎదుర్కొన్న కష్టాలు, వారి సుదీర్ఘ పోరాటాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.
'ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ' టైటిల్ ఫిక్స్:
ఈ సినిమా కోసం బాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. 'ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ' అనే పేరును ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యమంలో భాగంగా ఇప్పటివరకు బయటకు రాని అనేక ఆసక్తికరమైన, దిగ్భ్రాంతికరమైన నిజాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారని చిత్రబృందం చెబుతోంది.
భారీ బడ్జెట్‌తో 2027లో రిలీజ్:
దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. 2027లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌లో నటించబోయే ప్రధాన నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేపర్ లీక్ అంశం, వారి ఆందోళనల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక విద్యార్థుల నిజాయితీతో కూడిన పోరాటాన్ని, వెలుగులోకి రాని సంఘటనలను 'ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ' ద్వారా ప్రేక్షకుల ముందుకు ఏ విధంగా తీసుకొస్తారో వేచి చూడాలి.
