తెలుసు కదా డైరెక్టర్ పై శ్రీనిధి కామెంట్స్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న చిత్ర బృందం ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.
By: Madhu Reddy | 29 Sept 2025 1:18 AM ISTప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజాకోన తొలి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'తెలుసు కదా'. అక్టోబర్ 17వ తేదీన భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. అలాగే కేజిఎఫ్ , హిట్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న శ్రీనిధి శెట్టి అలాగే రాశిఖన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించారు. తెలుగు భాషా రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న చిత్ర బృందం ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి సినిమా కబుర్లు చెప్పడమే కాకుండా డైరెక్టర్ గా తన కెరియర్ ను యు టర్న్ తీసుకున్న నీరజా కోన గురించి కూడా ఊహించని కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆమెలో ఉన్న టాలెంట్స్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న నీరజ కోన మొదటిసారి డైరెక్టర్ అయ్యారు కదా.. ఆమె సెట్ లో ఎలా ఉంటారు? ఆమె డైరెక్షన్ ఎలా ఉంది? అని ప్రశ్నించగా శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. "అసలు ఆమెకు ఈ సినిమా తొలి డైరెక్షన్ అంటే ఎవరు నమ్మరు. డైరెక్షన్ విభాగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ సినిమాను చాలా అద్భుతంగా రూపొందించారు. ఆమె డైరెక్టర్ మాత్రమే కాదు లిరిసిస్ట్ కూడా.. ఈ మధ్యనే నాకు ఈ విషయం తెలిసింది. ఆమె గతంలో కూడా కొన్ని పాటలకు లిరిక్స్ అందించారట. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా, స్టైలిస్ట్ గా , గేయ రచయిత్రిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గా కూడా సక్సెస్ కాబోతున్నారు" అంటూ నీరజ కోన గురించి పలు కామెంట్లు చేసింది శ్రీనిధి శెట్టి.
నీరజ కోన విషయానికి వస్తే.. అమెరికాలో 14 సంవత్సరాల పాటు ఫ్యాషన్ కోర్సులు నేర్చుకొని.. ఇండియాకి తిరిగి వచ్చి తన సోదరుడు కోన వెంకట్ ద్వారా ' గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఇందులో హీరో నితిన్ కి స్టైలిస్ట్ గా పనిచేసింది. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, ఎవడు, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలకు పనిచేసి.. నటి సమంత కు వ్యక్తిగత స్టైలిస్ట్ గా కూడా వ్యవహరించింది.
అలాగే తిక్క, చల్ మోహన్ రంగా, మిస్ ఇండియా వంటి చిత్రాలలో కొన్ని పాటలకు గేయ రచయిత్రి గా కూడా పనిచేసింది. ఇప్పుడు తెలుసు కదా సినిమాతో డైరెక్టర్ గా అవతరించిన నీరజాకోన ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు.
