తెరపై హింస ఒక డ్రగ్..దానికి గాంధేయవాదమే విరుగుడు!
అయితే ప్రస్తుత భారతీయ సినిమాలో విస్తరిస్తున్న విపరీతమైన హింసాత్మక ట్రెండ్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
By: Srikanth Kontham | 2 Oct 2026 2:31 PM ISTగాంధీ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు నీరజ్ కబీ భారతీయ సినిమాల్లో పెరుగుతున్న హింస, దాని ప్రభావం మహాత్మా గాంధీ భావజాల ప్రాముఖ్యతపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. `సంవిధాన్` వంటి ప్రాజెక్ట్‌లలో గాంధీ పాత్రను పోషించిన నీరజ్ నేటి ఆధునిక కాలంలో గాంధేయవాదం ఏమాత్రం ప్రాముఖ్యత కోల్పోలేదని తేల్చి చెప్పారు. తరాలు మారినా గాంధీజీ బోధించిన సూత్రాలు సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.
గాంధీజీ జీవితంలో ప్రాథమికంగా నిలిచిన ఆరు ముఖ్యమైన గుణాలను నీరజ్ కబీ గుర్తుచేసుకున్నారు. అహింస, సత్యగ్రహం, త్యాగం, నాయకత్వం, మానవత్వం , సమానత్వం అనేవి కేవలం సాధన చేసే ధ్యానం మాత్రమే కాదని, ఆయన వాటిని శక్తివంతమైన ఆయుధాలుగా ఉపయోగించారని పేర్కొన్నారు. యుద్ధంలో పోరాడేందుకు సైనికుడికి శిక్షణ అవసరమైనట్లే.. ఈ అహింసా యుత ఆయుధాలను ధరించడానికి కూడా మానసిక శిక్షణ అవసరమని, ప్రతి ఒక్కరూ తమలోని ఉత్తమ రూపాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆరు నియమాలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు.
నేటి యువత కూడా గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ మార్పుకు శ్రీకారం చుడుతోందని కబీ కొనియాడారు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను ఉదాహ రణగా పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో యువత ఎలాగైతే మార్పు కోసం ముందుండి నడిచారో? నేడు కూడా అదే విధంగా అహింసా మార్గంలో పోరాడుతూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు.
అయితే ప్రస్తుత భారతీయ సినిమాలో విస్తరిస్తున్న విపరీతమైన హింసాత్మక ట్రెండ్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరపై చూపిస్తున్న హింస ఒక మత్తు పదార్థం (డ్రగ్) లాగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో సున్నితత్వం , విచక్షణ తగ్గుతున్న తరుణంలో సినిమా ద్వారా హింసను ఒక డ్రగ్‌లా సరఫరా చేస్తున్నామని హెచ్చరించారు. దేశ ప్రగతి అనేది కేవలం జీడీపీతోనే కాకుండా పౌరుల నైతిక విలువల ఆధారంగా కొలవబడుతుందని.. ఇది మరింత ముదిరి అవమానకరంగా మారకముందే పరిశ్రమ హెచ్చరికగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
సినిమాల్లో హింసను చూపించడాన్ని తాను సంపూర్ణంగా వ్యతిరేకించడం లేదని, కానీ దానికి ఒక బలమైన కథా ఉద్దేశం ఉండాలని స్పష్టం చేశారు. `షిండ్లర్స్ లిస్ట్` వంటి చిత్రాలలో చూపిన హింస కథలోని తీవ్రతను, సందేశాన్ని ఎత్తిచూపడానికి ఉపయోగపడిందని గుర్తుచేశారు. కేవలం బాక్సాఫీస్ వద్ద డబ్బు సంపాదించడమే ధ్యేయంగా హింసను గ్లోరిఫై చేయడం కళకే కాక గాంధేయవాదానికి కూడా విరుద్ధమని, ఇది వీక్షకులను తప్పుడు మార్గంలో ప్రేరేపిస్తుందని అభిప్రాయపడ్డారు.
సమాజంలో పెరుగుతున్న విచక్షణారహిత భావజాలానికి - వెండితెరపై చూపిస్తున్న హింసకు గాంధేయవాదమే ఏకైక విరుగుడని నీరజ్ కబీ ఉద్ఘాటించారు. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు రూపొందినప్పుడే కళకు, సమాజానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.
