Begin typing your search above and press return to search.

సినిమాల్లో పెరుగుతున్న టాక్సిసిటీ!

సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. క‌ల్పితం అనే పేరుతో సమాజంలో జరిగే పరిణామాలనే వెండితెరపై ఆవిష్క‌రిస్తున్నారు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

By:  Srikanth Kontham   |   29 Jun 2026 9:41 AM IST
సినిమాల్లో పెరుగుతున్న టాక్సిసిటీ!
X

సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. క‌ల్పితం అనే పేరుతో సమాజంలో జరిగే పరిణామాలనే వెండితెరపై ఆవిష్క‌రిస్తున్నారు అన్న‌ది కాద‌న‌లేని నిజం. అయితే ఇటీవలి కాలంలో పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ చర్చనీ యాంశంగా మారింది. అదే సినిమాల్లో పెరుగుతోన్న టాక్సిసిటీ. తీవ్రమైన హింస, మహిళలను తక్కువ చేసి మాట్లాడటం, నెగిటివిటీ వైఖరిని హీరోయిజంగా ప్రొజెక్ట్ చేయడం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే ఫార్ములాగా మారిపోయింది. ఈ ధోరణిపై కొందరు దర్శకులు, విమర్శకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో చూపిస్తోన్న‌ మితిమీరిన టాక్సిసిటీ థియేటర్లలో సంచలనం సృష్టించి వసూళ్లు రాబట్టడం కోసమేనా? లేక ఇండస్ట్రీ సమాజంపై చేస్తున్న అదృశ్య దాడా? అంటూ ప్రశ్నించారు. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో పాత్రలలోని క్రూరత్వాన్ని గ్లోరిఫై చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఈ తరహా టాక్సిక్ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధిస్తుండటం వెనుక ఉన్న కమర్షియల్ మైండ్ గేమ్‌ను కూడా మనం గమనించాల‌న్నారు.

పాత్రలోని నెగెటివిటీని ఆల్ఫా మేల్ అనే ఆకర్షణీయమైన లేబుళ్లతో ప్యాక్ చేసినప్పుడు నేటి యువత దానికి సులువుగా కనెక్ట్ అవుతోందన్నారు. సామాన్య జీవితంలో తప్పుగా పరిగణించబడే ప్రవర్తనను వెండితెరపై స్టార్ హీరో చేసినప్పుడు అది ఫ్యాషన్ గా మారిపోతోందన్నారు. థియేటర్లలో చప్పట్లు, ఈలలు రాబట్టడం కోసమే దర్శకులు పాత్రల క్యారెక్టరైజేషన్లను ఇంత తీవ్రంగా మార్చేస్తున్నారనే విమర్శల్లో నిజం లేకపోలేదన్నారు. ఈ ధోరణి వల్ల సమాజంపై ముఖ్యంగా యువత మానసిక స్థితిపై పడే ప్రభావం ప్రమాదకరమైంద‌న్నారు.

థియేటర్లలో హీరో చేసే పనులకు ఎలాంటి పశ్చాత్తాపం లేనప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ప్రవర్తన సరైనదేననే తప్పుడు సంకేతాలు జనాల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు. సమాజంలో మనుషుల మధ్య ఉండాల్సిన గౌరవం, సానుభూతిని ఈ రకమైన సినిమాలు దెబ్బతీస్తున్నాయని నీరజ్ ఘైవాన్ స‌హా ప‌లువురు దర్శకులు భావిస్తున్నారు. సినిమా అనేది వ్యాపార వనరు మాత్రమే కాదు. అదొక‌ శక్తివంతమైన సామాజిక సాధనం అనే విషయాన్ని మేకర్స్ మరువకూడదు.

సినిమాల్లో పాత్రలను డార్క్ షేడ్స్‌లో చూపించడంలో తప్పు లేదు. కానీ ఆ డార్క్‌నెస్‌ను ఆదర్శంగా మార్చడమే అసలైన సమస్య. వినోదం .. కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవచ్చు. కానీ అది సామాజిక బాధ్యతను విస్మరించి జరగకూడదు. భ‌విష్య‌త్ లో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దర్శకులు ఈ టాక్సిక్ ట్రెండ్ నుండి బయటకొచ్చి బలమైన హ్యూమన్ ఎమోషన్లతో కూడిన వైవిధ్యమైన కథలపై దృష్టి పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు.