60 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉందంటారా?
60 ఏళ్ల వయస్సులోనూ నటనతో అలరిస్తూనే వచ్చే విమర్శలను, వదంతులను చమత్కారంతో తిప్పికొట్టడంలో నీనా ప్రత్యేకమైన శైలికి నిదర్శనం.
By: Srikanth Kontham | 18 Sept 2026 12:22 PM ISTబాలీవుడ్ లో సీనియర్ నటి నీనా గుప్తా ప్రత్యేకతే వేరు. మూస ధోరణులను తిరగరాస్తూ సామాజిక కట్టుబాట్లకు అతీతంగా స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే అరుదైన నటీమణి. వ్యక్తిగత జీవితంలోనైనా? వెండితెరపైనైనా? మనసుకు తోచిన బాటలోనే పయనిస్తూ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. 60 ఏళ్ల వయస్సులోనూ నటనతో అలరిస్తూనే వచ్చే విమర్శలను, వదంతులను చమత్కారంతో తిప్పికొట్టడంలో నీనా ప్రత్యేకమైన శైలికి నిదర్శనం.
తాజాగా ఓ వివాహ రిసెప్షన్ వేడుకకు నీనా గుప్తా సంప్రదాయ చీరకట్టులో హాజరయ్యారు. ఆ వేడుకలో ఆమె ధరించిన చీర మందపాటి ఫ్యాబ్రిక్‌తో తయారవ్వడం, కుచ్చిళ్ళు సరిగ్గా పొట్ట భాగం పైకి వచ్చేలా అమరడంతో అక్కడ కాస్త ఉబ్బెత్తుగా కనిపించింది.
ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ లుక్‌ను ఆధారంగా చేసుకుని నెటిజన్లు నీనాపై వదంతులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 60 ఏళ్ల వయస్సులో నీనా గుప్తా గర్భవతి అయ్యారంటూ నెట్టింట ప్రచారం గుప్పుమంది. సాధారణంగా ఇలాంటి రూమర్లు వచ్చినప్పుడు ఎవరైనా సీరియస్ అవుతారు. నెటిజనులపై అంతెత్తున లేస్తారు. కానీ నీనా గుప్తా మాత్రం ఊహాగానాలపై కూడా తనదైన శైలిలో వినోదాత్మకంగా స్పందించారు
ప్రారంభంలో పదే పదే ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల కాస్త అసహనం, కోపం కలిగాయన్నారు. అయితే ఆ తర్వాత కొందరు పదే పదే ఇదే విషయంపై ఆరా తీస్తుండటంతో తాను కూడా ఆటపట్టిస్తూ చమత్కారంగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టానన్నారు. `ఎవరైనా నన్ను అడిగితే.. అవును. నేను ప్రెగ్నెంట్‌నే అని చెప్పేదాన్ని. అయినా ఈమధ్యే 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన వార్త చూశాను. అంటే నాకు కూడా ఇంకా ఛాన్స్ ఉందన్నమాట అంటూ నవ్వేసారు. గతంలో నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా `బధాయి హో`లో కూడా ఆమె లేటు వయస్సులో గర్భం దాల్చే మహిళగానే కనిపించారు.
అందులో పాత్రను గుర్తు చేసుకున్నారు. నిజ జీవితంలో `బధాయి హో` లాంటిది ఏమీ జరగడం లేదని.. తాను గర్భవతిని కానని స్పష్టం చేశారు. కేవలం ఆ చీర ఫ్యాబ్రిక్ మందంగా ఉండటం వల్లే ఎత్తుగా కనిపించిందని అనుమానాలకు తెరదించారు. నీనా వ్యక్తిగత జీవితంపై సమాజం నుంచి ఇలాంటి విమర్శలు, ప్రశ్నలు ఎదురుకావడం కొత్తేమీ కాదు. గతంలో వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బంధం, కుమార్తె మసాబా గుప్తాను సింగిల్ మదర్‌గా పెంచడం వంటి విషయాల్లో కూడా నీనా సమాజపు ఒత్తిళ్లకు తలొగ్గక ధైర్యంగా నిలబడ్డారు. తాజాగా వచ్చిన ప్రెగ్నెన్సీ రూమర్లను సైతం చమత్కారంతో, ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టి మరోసారి నిండైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.
