బాలయ్య కోసం రంగంలోకి దిగిన మనోజ్.. సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇదే గేమ్ ఛేంజరా?
మరోవైపు టాలీవుడ్‌లో హీరోలు విలన్ పాత్రల వైపు వెళ్లే ట్రెండ్ కూడా బలపడుతోంది. ఒకప్పుడు హీరో ఇమేజ్‌కు భిన్నంగా భావించిన నెగటివ్ రోల్స్, ఇప్పుడు నటుడి సామర్థ్యాన్ని కొత్త స్థాయిలో చూపించే అవకాశాలుగా మారాయి.
By: Sravani Lakshmi Srungarapu | 20 May 2026 11:30 AM ISTనందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు మరో ఆసక్తికర అంశం తోడైంది. మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మనోజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ సినిమా ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలయ్య సినిమాలో మనోజ్ పాత్ర విలన్ షేడ్స్‌లో ఉంటుందన్న ప్రచారం ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ తీసుకొచ్చింది.
నందమూరి- మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ అనుబంధంతోనే గతంలో ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో కూడా బాలయ్య కనిపించారు. ఆ సినిమాలో బాలయ్య స్పెషల్ రోల్ లో కనిపించగా, ఇప్పుడదే బాలయ్య కోసం మనోజ్ రంగంలోకి దిగడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న మనోజ్, ఇప్పుడు నెగటివ్ లేదా పవర్‌ఫుల్ క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులేయడం ఆయన కెరీర్‌లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది. రీఎంట్రీ తర్వాత ఆయన ఎంచుకుంటున్న పాత్రలు కూడా అందుకు సంకేతాలే. మిరాయ్, భైరవం సినిమాల్లో మనోజ్ యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో, డైరెక్టర్లు ఇప్పుడు ఆయనను కేవలం హీరోగా కాకుండా స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడిగా చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు టాలీవుడ్‌లో హీరోలు విలన్ పాత్రల వైపు వెళ్లే ట్రెండ్ కూడా బలపడుతోంది. ఒకప్పుడు హీరో ఇమేజ్‌కు భిన్నంగా భావించిన నెగటివ్ రోల్స్, ఇప్పుడు నటుడి సామర్థ్యాన్ని కొత్త స్థాయిలో చూపించే అవకాశాలుగా మారాయి. జగపతిబాబు కెరీర్‌కు విలన్ పాత్రలు ఎలా కొత్త జీవం పోశాయో, ఆది పినిశెట్టి వంటి నటులు నెగటివ్ రోల్స్‌తో ఎలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. ఇప్పుడదే తరహాలో మనోజ్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేస్తున్నాడన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాలయ్య లాంటి మాస్ స్టార్‌కు ఎదురుగా నిలిచే పాత్ర దక్కడం చిన్న విషయం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అఫీషియల్ గా సినిమాలో మనోజ్ పాత్రపై క్లారిటీ ఇవ్వకపోయినా, బాలయ్య vs మనోజ్ స్క్రీన్ ఫైట్ మాత్రం థియేటర్లలో హైలైట్ అయ్యే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.
అంతేకాదు, బాలకృష్ణ సినిమాల్లో స్ట్రాంగ్ విలన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్, అఖండ వంటి సినిమాల్లో హీరో ఎలివేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో, విలన్ పాత్రల డిజైన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండేది. అందుకే బాలయ్య సినిమాల్లో విలన్ పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడదే తరహాలో మనోజ్‌కు కూడా గట్టి స్కోప్ దక్కిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని మాస్ క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో ప్రత్యేక శైలి కలిగిన డైరెక్టర్ కావడంతో, మనోజ్ క్యారెక్టర్ ను కూడా భారీ స్థాయిలో ప్రెజెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే మనోజ్‌కు హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, పాన్ ఇండియా లెవెల్ పెర్ఫార్మర్‌గా కొత్త అవకాశాల తలుపులు తెరుచుకునే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
