ఇఫీ -2025 ఉత్సవాల్లో ఎన్బీకేకు అరుదైన గౌరవం
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఉత్సవాలు వైభవంగా గోవాలో ప్రారంభమయ్యాయి.
By: Sivaji Kontham | 21 Nov 2025 12:49 AM IST56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఉత్సవాలు వైభవంగా గోవాలో ప్రారంభమయ్యాయి. గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు సృజనాత్మక మార్పిడి, కొత్త స్నేహాలు, సినిమాటిక్ ఎక్సలెన్స్ వేడుకలకు అర్థవంతమైన వేదిక. ప్రపంచవ్యాప్త ఫిలింమేకర్స్, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు, అంతర్జాతీయ కళాకారులు కొలువు దీరే ఈ చోట ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
`గాడ్ ఆఫ్ మాసెస్` నందమూరి బాలకృష్ణకు ఇఫీలో ఆయన సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు, శాలువాతో కార్యక్రమంలో ప్రత్యేక సన్మానం లభించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఎన్బీకే కెరీర్ లో అజేయంగా 100కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్న ఎన్బీకే .. రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాలలోను నిమగ్నమై ఉన్నారు. ఎన్బీకే నటించిన అఖండ 2 త్వరలో విడుదలకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
సనాతన ధర్మంపై ఎన్బీకే ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక నిరతికి తగిన రీతిలో బోయపాటి ఒక అద్భుత కథాంశాన్ని ఎంపిక చేసుకుని తెరకెక్కించారని కథనాలొస్తున్నాయి. అఖండ 2 తెలుగు సినీపరిశ్రమ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమన్న చర్చ సాగుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు భాగాన్ని వీక్షించాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
