ప్రేమ- సినిమా-పోరాటం: నయనతార - విఘ్నేష్ శివన్ భావోద్వేగం
నయనతార రాసిన పోస్ట్‌కు విఘ్నేష్ శివన్ అంతే ఎమోషనల్‌గా స్పందించారు. ఆమెను తన ప్రాణం (ఉయిర్), ప్రపంచం (ఉలగం) .. తన బలంగా అభివర్ణించారు.
By: Sivaji Kontham | 11 April 2026 7:00 PM ISTసినీ ప్రపంచంలో కొన్ని జంటలు కేవలం తెరపైనే కాకుండా.. నిజ జీవితంలోనూ అద్భుతమైన స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార .. దర్శకుడు విఘ్నేష్ శివన్ జోడీ అగ్రస్థానంలో ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా విఘ్నేష్ తెరకెక్కించిన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (LIK) చిత్రం విడుదలైన సందర్భంగా వీరిద్దరి మధ్య సాగిన భావోద్వేగ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా..ఒక నిర్మాతగా.. దర్శకుడిగా వీరి మధ్య ఉన్న పరస్పర గౌరవం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన భర్త పదేళ్ల సినీ కృషిని కొనియాడుతూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. LIK అనేది కేవలం ఒక సినిమా కాదు... అసాధ్యమనిపించిన కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని అది మాకు నేర్పింది.. అని ఆమె పేర్కొన్నారు. విఘ్నేష్ పడ్డ కష్టానికి సినిమా పరిశ్రమ కచ్చితంగా తగిన ప్రేమను తిరిగి ఇస్తుందని ఆకాంక్షించిన నయన్, తాను విఘ్నేష్‌కు అతిపెద్ద అభిమానిగా ఎప్పుడూ అండగా ఉంటానని వెల్లడించారు. పరిస్థితులకు అతీతంగా కలలు కనే ధైర్యం ఉన్న వ్యక్తిగా తన భర్తను ప్రపంచానికి పరిచయం చేస్తూ పెట్టిన ఈ పోస్ట్ అందరినీ కదిలించింది.
నయనతార రాసిన పోస్ట్‌కు విఘ్నేష్ శివన్ అంతే ఎమోషనల్‌గా స్పందించారు. ఆమెను తన ప్రాణం (ఉయిర్), ప్రపంచం (ఉలగం) .. తన బలంగా అభివర్ణించారు. పదేళ్ల క్రితం `నానుమ్ రౌడీ దాన్` కథ విన్నప్పుడు తన నేపథ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా తనను నమ్మిన రోజు నుండి నేటి వరకు తన జీవితం నయనతార వల్లే ఒక దీవెనలా మారిందని కృతజ్ఞతలు తెలిపారు. తనకంటే నయనతారే క్యాప్షన్లు చాలా బాగా రాస్తారని సరదాగా వ్యాఖ్యానిస్తూనే నయన్ ని తన భార్యగా, స్నేహితురాలిగా.. నిర్మాతగా గౌరవించడం ఆయనలోని సంస్కారాన్ని చాటిచెప్పింది.
ఈ సినిమా విడుదల రోజున చెన్నైలోని ఒక థియేటర్‌లో కనిపించిన దృశ్యం అభిమానులను మురిపించింది. సినిమా షో స్టార్ట్ అవుతోంది.. అంటూ నయనతార, విఘ్నేష్ ఇద్దరూ తమ పిల్లలను ఎత్తుకొని థియేటర్ వైపు పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా.. తన భర్త నిర్మించిన సినిమాపై ఉన్న మమకారంతో సామాన్యురాలిలా పిల్లలతో కలిసి పరుగులు పెట్టడం నయన్‌కు సినిమా పైనా.. తన కుటుంబంపైనా ఉన్న అంకితభావాన్ని నిరూపించింది.
వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా.. ఒకరి విజయాల్లో మరొకరు తోడుగా నిలవడం ఈ జంట ప్రత్యేకత. సినిమా అంటే విఘ్నేష్‌కు కేవలం పని కాదు.. అది ఆయన శ్వాస అని నయనతార చెప్పడం వారి మధ్య ఉన్న లోతైన అవగాహనకు అద్దం పడుతోంది. నువ్వు సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నావో.. సినిమా కూడా నీకు అంతే ప్రేమను తిరిగి ఇస్తుంది అని నయనతార చెప్పిన మాటలు ప్రతి సినీ కళాకారుడికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ క్రియేటివ్ కపుల్ మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
