Begin typing your search above and press return to search.

చాలా పెద్ద మెసేజ్ పెట్టిన నయనతార!

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ల జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

By:  Madhu Reddy   |   15 Feb 2026 12:29 AM IST
చాలా పెద్ద మెసేజ్ పెట్టిన నయనతార!
X

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ల జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా నయన్ తన భర్తపై కురిపించిన ప్రేమ, రాసిన లేఖ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. కేవలం విష్ చేయడమే కాకుండా, తన జీవితంలో విఘ్నేష్ స్థానాన్ని వివరిస్తూ ఆమె రాసిన భావోద్వేగపూరితమైన సందేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.




పదేళ్ల బంధం:

నయనతార తన ఇంస్టాగ్రామ్ పోస్ట్‌లో విఘ్నేష్ శివన్‌ను తన ప్రాణం అని సంబోధిస్తూ, తమ బంధం దైవ నిర్ణయమని పేర్కొన్నారు. కొన్ని ఆత్మలు మనం కలవకముందే మన జీవితం లో రాసి ఉంటాయి, నువ్వు నా జీవితంలోకి రావడం మా అమ్మ చేసిన ప్రార్థనల ఫలితం అంటూ ఆమె రాసుకొచ్చారు. వీరిద్దరి పరిచయం జరిగి పదేళ్లు పూర్తయినా, ఒక్క రోజు అతను దూరంగా ఉన్నా తను తట్టుకోలేనని, అంతటి గాఢమైన అనుబంధం తమ మధ్య ఉందని నయన్ వెల్లడించారు. ఈ సుదీర్ఘ సందేశంతో పాటు షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోలు వారి మధ్య ఉన్న అన్యోన్యతను చాటిచెబుతున్నాయి.

మనుషుల రూపంలో ఉన్న నా ఇల్లు నువ్వే:

ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదని, అది ఓర్పు, నమ్మకం మరియు దయను నేర్పిస్తుందని విఘ్నేష్ వల్ల తాను తెలుసుకున్నానని నయనతార భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వు నా నిశ్శబ్ద బలం, నా ధైర్యం.. మనుషుల రూపంలో ఉన్న నా ఇల్లు నువ్వే' అంటూ ఆమె ఇచ్చిన నిర్వచనం అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా నయనతార తన వ్యక్తిగత విషయాలను అంతగా బయటపెట్టరు, కానీ ప్రేమికుల రోజున తన మనసు పొరల్లోని ప్రేమనంతా అక్షర రూపంలో పెట్టి విఘ్నేష్ కు థాంక్స్ చెప్పారు. ప్రతి కాలంలోనూ తన వెంటే ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదర్శంగా నిలుస్తున్న 'విక్కీ-నయన్' జంట:

సినీ ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథలు పుడుతుంటాయి, కనుమరుగవుతుంటాయి. కానీ నయనతార-విఘ్నేష్ శివన్ జంట మాత్రం తమ నిలకడైన ప్రేమతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకోవచ్చని వీరు నిరూపిస్తున్నారు. నయనతార పెట్టిన ఈ సుదీర్ఘ సందేశం వారి అభిమానులకు అసలైన 'వాలెంటైన్ ట్రీట్' అని చెప్పవచ్చు. ఇక ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్‌గారు మూవీ తో సూపర్ హిట్ అందుకున్నారు నయనతార. ఈ జంట ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.