నయనతార 'హాయ్'.. ప్రేమకు ఫ్రెష్ టచ్!
నయనతార, కవిన్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Sept 2026 7:07 PM ISTప్రేమకథలు అంటే రెగ్యులర్ గా హీరోహీరోయిన్ల మధ్య మొదలయ్యే ఎట్రాక్షన్, అపార్థాలు, చివరికి కలయిక అనే ఫార్ములానే గుర్తొస్తుంది. కానీ మారుతున్న కాలంలో ప్రేమకు ఎదురయ్యే ఫ్యామిలీ ప్రెజర్స్, వ్యక్తిగత భయాలు, తిరస్కరణలు, ఆత్మన్యూనత వంటి అంశాలను కూడా కథలో భాగం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమకాలీన అంశాలతో రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా హాయ్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. నయనతార, కవిన్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
హాయ్ కథలో ప్రేమ కోసం నిరంతరం ప్రయత్నించే ఓ యువకుడు, తన జీవితంపై కుటుంబం విధించే నిర్ణయాల నుంచి బయటపడాలని చూసే ఓ యువతి ఎదురుపడతారు. ప్రేమలో పలుమార్లు విఫలమైనా వెనక్కి తగ్గని యువకుడిగా కవిన్ కనిపిస్తే.. తనకు నచ్చని పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా నయనతార నటించారు. ఇద్దరి జీవితాలు కలిసిన తర్వాత వారి మధ్య ఏర్పడే అనుబంధం కేవలం ప్రేమకథగా కాకుండా.. అంగీకారం, ఆత్మాన్వేషణ, వ్యక్తిగత స్వేచ్ఛ చుట్టూ సాగుతుంది.
నయనతార పాత్రలో బలం, బలహీనత రెండూ కనిపించేలా డైరెక్టర్ విష్ణు ఎడవన్ కథను తెరకెక్కించారు. బయటకు స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ తనలోని భయాలు, భావోద్వేగ సంఘర్షణలతో ఆమె పాత్ర ప్రయాణిస్తుంది. మరోవైపు కవిన్ పాత్ర తన భావాలను దాచుకోకుండా ప్రేమించిన వ్యక్తి కోసం పోరాడుతుంది. రిజెక్షన్, తాను సరిపోతానా? అనే అనుమానం, అర్థవంతమైన బంధం కోసం ఎదురుచూపు వంటి అంశాలు ఈ పాత్రకు కీలకంగా నిలుస్తాయి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచేలా డైరెక్టర్ కథను రూపొందించినట్టు తెలుస్తోంది.
ప్రేమతో పాటు ఫ్యామిలీకి ఉండే అంచనాలు, రిలేషన్స్ ను కంటిన్యూ చేయడంలో ఎదురయ్యే అంతర్గత సంఘర్షణలను కూడా డైరెక్టర్ ఈ సినిమాలో చూపించారు. రాధిక శరత్‌కుమార్, దివంగత నటుడు కే. భాగ్యరాజ్, ప్రభు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కే. భాగ్యరాజ్ నటించిన ఆఖరి చిత్రాల్లో హాయ్ కూడా ఒకటి కావడం ప్రత్యేకతగా మారింది. జెన్ మార్టిన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ఎట్రాక్షన్ కాగా.. రసగుల్లా సాంగ్ ఇప్పటికే ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ, తెలుగు, మలయాళ జీ5 బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. సమకాలీన సంబంధాలను హానెస్టీ, కామెడీ, ఎమోషన్స్ తో చూపించే కథగా హాయ్ సినిమాను పేర్కొన్నారు. నయనతార తన పాత్రలోని బలం, బలహీనతల సమతుల్యత తనను ఆకట్టుకుందని చెప్పగా.. కవిన్ తన క్యారెక్టర్ ఎమోషన్స్ ను స్వేచ్ఛగా వ్యక్తపరచడం తనకు ప్రత్యేకంగా నచ్చిందన్నారు. ఇప్పటికే ప్రశంసలు అందుకున్న హాయ్ ను ఇప్పుడు మరింత మంది ఆడియన్స్ తమిళ జీ5 ద్వారా చూసే అవకాశం లభించింది.
