ఆ తప్పులను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా...
ఒకసారి ఒక సినిమా షూటింగ్లో మోహన్ లాల్ గారితో నటించినప్పుడు నా పాత్రకు చాలా డైలాగులు ఉండేవి. అయితే ఆ డైలాగులకు తగ్గట్టుగా హావాభావాలను పలికించేందుకు తెగ కష్టపడి పోయాను.
By: Madhu Reddy | 7 Dec 2025 9:44 AM ISTజీవితంలో మనిషి అన్నాక తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాం అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా. అలాంటి వారిలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఒకరు. తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో నటిస్తూ తన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా.. ఇంకా స్టార్ హీరోయిన్ గానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
ఒకవైపు సౌత్ సినిమాలతోనే కాదు మరొకవైపు హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ అక్కడ కూడా భారీ పాపులారిటీ అందుకున్న నయనతార.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్లో తాను చేసిన తప్పులు, పొరపాట్ల గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ గురించి నయనతార మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించాను. ఆ హీరోలతో నటించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ వచ్చాను. అందులో నటన గురించి మెలకువలు నేర్చుకోవడంలో చేసిన పొరపాట్లు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను.
ఒకసారి ఒక సినిమా షూటింగ్లో మోహన్ లాల్ గారితో నటించినప్పుడు నా పాత్రకు చాలా డైలాగులు ఉండేవి. అయితే ఆ డైలాగులకు తగ్గట్టుగా హావాభావాలను పలికించేందుకు తెగ కష్టపడి పోయాను. మోహన్ లాల్ గారేమో ఇంకా బాగా హావభావాలు పలకాలి అని నాతో చెప్పారు. ఇక పదేపదే చెబుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక తెగ కంగారు పడిపోయాను. అయితే నా పరిస్థితిని అర్థం చేసుకున్న డైరెక్టర్ అక్కడికి వచ్చి ఈరోజుటికి చాలు.. రేపు ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం అని చెప్పి నన్ను రక్షించారు. ఇంటికి వెళ్ళాక కూడా మరునాడు చేయబోయే సీన్ల కోసం రాత్రంతా రిహార్సల్స్ చేశాను. మరుసటి రోజు షూటింగ్ సెట్లో అందరూ అనుకున్నట్టుగానే నటించాను. షాట్ చాలా బాగా వచ్చింది. ఇక నన్ను అందరూ మెచ్చుకున్నారు.
అయితే నిజానికి అప్పుడప్పుడు సినిమాలలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ విషయాలను నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను" అంటూ నయనతార తెలిపింది. అదే ఇంటర్వ్యూలో తన భర్త , పిల్లల గురించి కూడా చెప్పుకొచ్చింది నయనతార. నయనతార మాట్లాడుతూ.." నేను, నా భర్త విఘ్నేష్ ఇద్దరం ఎంత పని ఉన్నా సరే కలిసే భోజనం చేస్తాము. మొదటి ముద్ద నాకు పెట్టనిదే ఆయన తినరు. ఇక ఎప్పుడైనా గొడవపడినప్పుడు లేదా నేను అలిగినప్పుడు కూడా అలవాటు మానుకోరు. నన్ను కాసేపు బ్రతిమిలాడైనా సరే నాకు తినిపిస్తారు" అంటూ తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చింది.
అలాగే పిల్లల గురించి మాట్లాడుతూ.." నేను ఎంత బిజీగా ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి నా పిల్లలకి కబుర్లు చెప్పి వారిని నిద్రపుచ్చుతాను. వారు నిద్రపోయినా సరే వారితో కబుర్లు చెబుతూనే ఉంటాను. దీనినే పాజిటివ్ స్లీప్ టాక్ అంటారు. వారు మనం చెప్పే మాటలు వినకపోయినా వారి మనసుకు చేరుతాయని నేను బలంగా నమ్ముతాను" అంటూ నయనతార తెలిపింది.
